కలెక్టర్ యోగితా రాణా నిర్ణయం...పెరిగిన ఉద్యోగుల హాజరు

SMTV Desk 2017-08-22 15:51:38  COLLECTOR YOGITHA RANA, EDUCATIONAL SYSTEM, REVENUE SYSTEM, BIOMETRIC ATTENDENCE

హైదరాబాద్, ఆగస్ట్ 22 : నిజామాబాద్ జిల్లాను తనదైన శైలి అభివృద్ధి పథంలో ముందుకు నడిపించిన కలెక్టర్ యోగితా రాణా ఇటీవల హైదరాబాద్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన విషయం విదితమే. ఆమె నగరానికి బదిలీ అవ్వగానే మొదట విద్యావ్యవస్థపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న అభిప్రాయాన్ని పోగొట్టే విధంగా విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పుడు సరికొత్తగా ఆమె రెవెన్యూ శాఖను గాడిన పెట్టే పనిలో పడ్డారు. ఉద్యోగుల హాజరుపై దృష్టి సారిస్తూ ఇందుకోసం బయోమెట్రిక్ ను ఆయుధంగా ఎంచుకున్నారు. జిల్లా కలెక్టరేట్ తో పాటు ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాలన్నింటిలో పక్కాగా బయోమెట్రిక్ ను అమలు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదివరకే గతంలో బయోమెట్రిక్ హాజరును తప్పనిసరిగా పాటించాల్సిందేన౦టూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఒక్క కలెక్టరేట్ మినహా మిగతా ఎక్కడా బయోమెట్రిక్ హాజరును పాటించడం లేదని క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. కాని ఇప్పుడు కొత్త కలెక్టర్ యోగితా రాణా ఉద్యోగుల హాజరు విషయానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ హాజరును తప్పనిసరిగా నమోదు చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెవెన్యూ శాఖలో గుబులు మొదలైంది. బయోమెట్రిక్ లో ఏవైనా సాంకేతిక కారణాలు౦టే వెంటనే పరిష్కరించుకోవాలంటూ సూచించారు. వచ్చే గురువారం నుంచి బయోమెట్రిక్ ను తప్పనిసరి చేయనున్నారు. దీంతో ఇంతకాలంగా ఏదో మొక్కుబడిగా కార్యాలయానికి వచ్చే ఉద్యోగులు కలవరపడుతున్నారు. తాజాగా ఇప్పుడు కలెక్టర్ యోగితా రాణా తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగుల హాజరు పెరగడంతో పాటు.. తన విధులను సక్రమంగా నిర్వర్తించే అవకాశం ఎక్కువగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.