పరీక్ష రాసినవారెవ్వరూ పాస్ అవ్వలేదు!

SMTV Desk 2019-05-03 11:33:17  law exam, chief justice, lawyers, preliminary, mains, interview

చెన్నై, మే 03: పరిక్షలన్నాక కొంత మంది పాస్ అవుతారు మరి కొంత మంది ఫెయిల్ అవుతుంటారు. కానీ....ఓ పరీక్ష మాత్రం రాసినవారెవ్వరూ పాస్ కాలేదట. అయితే... మూడువేల మందికి పైగా పరీక్షకు హాజరవ్వగా... ఒక్కరు కూడా పాస్ అవ్వకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన తమిళనాడులో జరగగా... జిల్లా న్యాయమూర్తి నియామక పరీక్షలో ఈ వింత చోటుచేసుకుంది.

తమిళనాడులో రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 31 జిల్లా న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి గాను మద్రాసు హైకోర్టు, తమిళనాడు ప్రభుత్వం సంయుక్తంగా జనవరి 13న పరీక్ష నోటిఫికేషన్‌ను విడుదల చేశాయి. దీనికి 35 ఏళ్ల నుంచి 48 ఏళ్ల మధ్య వయస్సున్న న్యాయవాదులు, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు (ఏపీపీలు), సివిల్‌ కోర్టుల్లో న్యాయమూర్తులుగా, మెజిస్ట్రేట్లుగా పనిచేస్తున్న పలువురు న్యాయమూర్తులు కలిపి 3,562 మంది దరఖాస్తు చేసుకున్నారు.

పరీక్షను ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూలుగా మూడు దశలుగా విభజించారు. ప్రిలిమినరీ పరీక్షను రెండు పేపర్లుగా ఏప్రిల్‌ 7న నిర్వహించారు. ప్రిలిమ్స్‌ పరీక్షకు మూడు వేల మందికి పైగా హాజరయ్యారు. పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. అందులో ఏ ఒక్కరు కూడా ఉత్తీర్ణత సాధించలేకపోవడం విశేషం. దీంతో మే 25,26 తేదీల్లో జరగాల్సిన మెయిన్‌ పరీక్షకు ఒక్కరు కూడా అర్హత సాధించలేకపోయారు.