డిజిటల్ పోలీస్

SMTV Desk 2017-08-22 15:33:19  Police, Passport verification, Digital, Central Home Minister

న్యూఢిల్లీ, ఆగస్ట్ 22: ఎక్కడో మారు మూల ప్రాంతంలో నేరాలు చేసి, మరోచోటకి నేరగాళ్లు మకాం మార్చేస్తున్న చాలా సంఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం సుపరిచితమే. అయితే ఇక నుండి అలాంటి ఆటలు సాగకుండా చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమైంది పోలీసు శాఖ. దీంతో నేరగాళ్లు ఎక్కడికీ తప్పించుకోలేరు. దీనిలో భాగంగా నేరాలు, నేరగాళ్ల ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌, సిస్టమ్స్‌ ప్రాజెక్టు(సీసీటీఎన్‌ఎస్‌) కింద దేశంలోని అన్ని రాష్ట్రాల క్రైమ్‌ రికార్డులను కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేసింది. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సోమవారం ఈ డిజిటల్ పోలీసు పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ నేపధ్యంలో ఆయన మాట్లాడుతూ ఈ పోర్టల్‌లోని వివరాలు అన్ని రాష్ట్రాల పోలీసులతో పాటు, కేంద్ర దర్యాప్తు సంస్థలకు అందుబాటులో ఉండబోతున్నాయని స్పష్టం చేశారు. తాజా విధానం వల్ల పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియలో పోలీసుల తనిఖీలు కూడా ఉండవు. గతంలో ఉన్న తనిఖీ విధానం వల్ల దరఖాస్తుదారుడు ఎదురుచూడాల్సిన పరిస్థితి తలెత్తేది. నేరాలు, నేరగాళ్ల ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌, సిస్టమ్స్‌ ప్రాజెక్టు అమలుతో దరఖాస్తుదారులకు నేర చరిత్ర ఉన్నది లేనిది ఒక్క క్లిక్ తోనే తెలిసిపోతుంది. అయితే ఇది కార్యరూపం దాల్చడానికి ఏడాది పడుతుందని అధికారులు తెలుపుతున్నారు. ఇప్పడి వరకు 13775 పోలీసు స్టేషన్ల వివరాలను ఆన్‌లైన్ లో అప్‌లోడ్ చేసినట్లు సమాచారం. కాగా, దేశం మొత్తం మీద 15398 పోలీసు స్టేషన్లు ఉన్నాయి.