ప్రధానిగా ములాయం సింగ్ యాదవ్ ను ఆదరిస్తే మంచిదే కానీ....

SMTV Desk 2019-05-02 15:45:12  akhilesh yadav, up cm, sp president, smajwadi party

న్యూఢిల్లీ, మే 02: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకులు ములాయం సింగ్ యాదవ్ ప్రధాని రేసులో లేరని ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఏర్పడిన బీఎస్పీ - ఎస్పీ - ఆర్‌ఎల్డీ కూటమి దేశానికి కొత్త ప్రధానిని ఇవ్వబోతుందని ఆయన అన్నారు. ప్రధాని ఎవరనేది ఫలితాల తర్వాత నిర్ణయిస్తామని అఖిలేష్ చెప్పారు.

ప్రధానిగా ములాయంను ఆదరిస్తే మంచిదే కానీ.. ఆయన ప్రధాని రేసులో లేరని యూపీ మాజీ సీఎం స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీకి లాభం చేకూర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐతో పాటు ఇతర సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందని అఖిలేష్ మండిపడ్డారు. ఎస్పీ, బీఎస్పీని బీజేపీ కంట్రోల్ చేస్తుందని రాహుల్ గాంధీ అనడం సరికాదు.

తమను ఎవరూ కంట్రోల్ చేయడం లేదని, తమ కూటమి బీజేపీ తప్పుడు విధానాలను, నిర్ణయాలను అరికట్టేందుకు కృషి చేస్తుందన్నారు అఖిలేష్ యాదవ్. దేశానికి కొత్త ప్రధాని కావాలని కోరుకునే వారిలో తాను కూడా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో యూపీ కీలకపాత్ర పోషిస్తుందని, తమ ఎంపీల సంఖ్యను పార్లమెంట్‌లో పెంచుకుంటామని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు.