తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన బీజేపీ

SMTV Desk 2019-05-02 12:26:32  Telangana Bandh,

ఇంటర్మీడియట్‌ ఫలితాలలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ బిజెపి నేడు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. నీమ్స్ ఆసుపత్రిలో నిరవదికదీక్షను కొనసాగిస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ రాష్ట్ర ప్రజలనుద్దేశ్యించి వ్రాసిన ఒక లేఖను మీడియాకు విడుదల చేశారు.

“ఇంటర్మీడియట్‌ ఫలితాలలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ ఏప్రిల్ 29 నుంచి నేను మొదలుపెట్టిన నిరవదిక దీక్షను రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల చేత భగ్నం చేయించినప్పటికీ నేను ఆసుపత్రిలోనే దీక్షను కొనసాగిస్తున్నాను. విద్యార్దులకు న్యాయం జరిగేవరకు నా పోరాటం కొనసాగిస్తాను. ఇంటర్ ఫలితాలలో అవకతవకలకు బాధ్యులైన బోర్డు కార్యదర్శి అశోక్, విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, విద్యాశాఖామంత్రి జగదీష్ రెడ్డి, బోర్డుకు సేవలందించిన గ్లోబరీనా సంస్థలపై ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నేటికీ వారు తమ పదవులలోనే కొనసాగుతున్నారు కనుక ఇంటర్ విద్యార్దులకు న్యాయం జరుగుతుందని ఆశించలేము. కావున రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరిని నిరసిస్తూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు, విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా ఈ బంద్‌లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. విద్యార్దులకు న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతోనే రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తున్నాము తప్ప రాజకీయ ప్రయోజనాల కోసం కాదు,” అని వ్రాశారు.