వ్యవసాయానికి 24 గంటల విద్యుత్

SMTV Desk 2017-06-02 19:27:32  kcr, formation day spech by kcr, 24 hours eletricity

హైదరాబాద్, జూన్ 2‌ : వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ప్రస్తుత యాసంగి నుంచే సాగుకు 24 గంటల విద్యుత్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా కేసిఆర్ మాట్లాడుతు తెలంగాణా సుసంపన్నమైనప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్దికి ఏమాత్రం నోచుకోలేదని, తెలంగాణా ఆవిర్భావం తర్వాత విశేషమైన అభివృద్ధి చోటు చేసుకుందని చెప్పారు. తెలంగాణా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న అందరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని వెల్లడించారు. తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమంలో భాగంగా వారి వేతనాలను భారీగా పెంచామని చెప్పారు. రెండు కొత్త పథకాలను ప్రారంభిస్తున్నట్లు ఆవిర్భావ దినోత్సవం నుండి ఒంటరి మహిళలకు వెయ్యి రూపాయల జీవన భృతి, గర్భిణిలు, బాలింతల కోసమై 12 వేల ఆర్థిక సహాయం, పసిపిల్లల కోసమై 2 వేల రూపాయల విలువ చేసే కేసిఆర్ కిట్ అందించడం జరుగుతుందని వెల్లడించారు. మిషన్‌ భగీరథ పనులు త్వరలోనే పూర్తిచేసి అన్ని గ్రామాలకు తాగునీరు అందిస్తామని, పల్లెల సౌభాగ్యం కోసం ప్రణాళికాయుతంగా కార్యక్రమాలు చేపడుతామని ప్రకటించారు. రైతులకు ఇప్పటికే రూ.17వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని వివరించారు. మిషన్‌ కాకతీయ పథకం వల్ల చెరువులు జలకళను సంతరించుకున్నాయని చెప్పారు. 22.5లక్షల టన్నుల ధాన్యం నిల్వ చేసుకునేలా గోదాముల నిర్మాణం చేపట్టామని, వ్యవసాయం దండగ కాదు పండగ అనుకునేలా కార్యక్ర మాలు నిర్వహించడం జరుగుతున్నదని చెప్పారు. వచ్చే ఖరీఫ్‌ నుంచి రైతులకు ఎకరానికి రూ.4వేల చొప్పున సాగుకు సాయం చేస్తామని ప్రకటించారు. పంటలకు గిట్టుబాటు ధర లభించేలా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. దీనికోసం రూ.500 కోట్లతో పంటల నిధి ఏర్పాటు చేస్తున్నాం. రైతులను సంఘటితం చేసి వారి పంటను వారు కోరుకున్న ధరకే అమ్ముకునేలా చేస్తాం. జూన్‌ 20 తర్వాత గొర్రెల పంపిణీ పథకం ప్రారంభమవుతుంది. రూ. 5వేల కోట్లతో 80 వేల గొర్రెల యూనిట్లు యాదవులకు పంపిణీ చేస్తాం. మత్స్యకారుల కోసం అన్ని చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలు పెంచుతున్నాం. రూ. వెయ్యి కోట్లతో ఎంబీసీల కోసం నిధి ఏర్పాటు చేశాం. గౌడ కులస్థుల కోసం ఈత వనాలు పెంచుతున్నాం. కులవృత్తులు చేపట్టిన వారికి అన్ని రకాలుగా అండగా నిలుస్తామని కేసీఆర్‌ పేర్కొన్నారు.