కాంగ్రెస్ పై పరువు నష్టం దావా వేస్తా: కెటిఆర్

SMTV Desk 2019-05-01 17:55:55  ktr, trs, inter board education, congress

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రతిపక్షాలపై తెవేర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలకు ఏ అంశం లేకపోవడంతోనే ఇంటర్మీడియట్‌ సమస్యను హైలైట్ చేస్తూ ప్రజల మెప్పు కోసం పాకులాడుతున్నాయని విమర్శించారు. విద్యాశాఖ అంశాన్ని ఐటి శాఖకు ముడిపెట్టడం ఏంటని ఆయన దుయ్యబట్టారు. ఇంటర్ బోర్డ్ ఇచ్చిన టెండర్లతో తనకు సంబంధమేంటని ప్రశ్నించారు. గ్లోబరీనాకు టెండర్ దక్కడం వెనుక తన హస్తం ఉందని ఆరోపించడంపై కెటిఆర్ ఫైర్ అయ్యారు. ఆ తప్పును ప్రతిపక్షాలు తనకు అంటగడుతున్నాయని పేర్కొన్నారు. అంతేగాక రూ.4కోట్ల టెండర్‌ను ఏకంగా రూ.10వేల కోట్ల కుంభకోణంగా పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఓ బఫూన్ సవాల్ చేసి పెద్దమ్మ గుడి దగ్గర ప్రమాణం చేయ్యమంటే వెళ్లాలా? అని మండిపడ్డారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలపై పరువు నష్టం దావా వేస్తానని కెటిఆర్ చెప్పారు. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు అధైర్యపడొద్దని, ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని, వారిని అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. అలాగే కేసీఆర్‌ను ఎవరైనా ఏమైనా అంటే కొన్ని మీడియాలు కత్తులు దూసేందుకు రెడీగా ఉంటాయన్నారు.