ప్లే ఆఫ్స్ మ్యాచ్ ల టికెట్స్ నుండి రూ.20 కోట్ల ఆదాయం!!!

SMTV Desk 2019-05-01 13:52:37  ipl 2019, play off matches, bcci, ipl 2019 final match

హైదరాబాద్: ఐపీఎల్‌ 2019 సీజన్ ప్లే ఆఫ్ మ్యాచ్ లల్లో టికెట్స్ ద్వారా రూ.20 కోట్లు రాబట్టాలని బీసీసీఐ అనుకుంటుంది. గతేడాది ఐపీఎల్‌ ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ల టికెట్స్ ద్వారా బీసీసీఐ రూ.18 కోట్లు ఆర్జించిందని తెలిసింది. అయితే ఈ ఐపీఎల్‌ 12వ సీజన్‌లో రూ.2 కోట్లు అధికంగా ఆర్జించాలని బీసీసీఐ భావిస్తోందట. లీగ్‌ దశలో మ్యాచ్‌ల టికెట్స్ ద్వారా వచ్చే ఆదాయం ఫ్రాంచైజీలకు వెళ్తుంది. ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ల టికెట్స్ ద్వారా వచ్చే ఆదాయం మాత్రం బీసీసీఐకి వెళుతుంది. మే 12న ఐపీఎల్‌ సీజన్‌-12 ఫైనల్‌ మ్యాచ్‌ హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో జరగనుంది. వాస్తవానికి.. ఐపీఎల్ సీజన్-11 విజేతగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిలవడంతో ఈ సీజన్ ఫైనల్‌ మ్యాచ్‌ చెన్నైలో జరగాలి. అయితే చెన్నై చిదంబరం స్టేడియంలో గత కొన్ని సంవత్సరాలుగా తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్, చెన్నై మున్సిపల్‌ కార్పొరేషన్‌ మధ్య స్టాండ్స్‌ వివాదం కొనసాగుతోంది. ఈ వివాదం కారణంగా చిదంబరం స్టేడియంలో ఏ మ్యాచ్‌ జరిగినా మూడు స్టాండ్‌(ఐ, జే, కే )లు ఖాళీగానే ఉంటున్నాయి.గొడవ కారణంగా చిదంబరం మైదానంలో ఐ,జే,కే స్టాండ్స్‌ తెరిచేందుకు అక్కడి నగర పాలక సంస్థ అంగీకరించలేదు. దాదాపు 12,000 సీట్లు ఖాళీగా ఉంటాయి కాబట్టి.. బీసీసీఐ మ్యాచ్‌ను 2018 రన్నరప్ హైదరాబాద్‌కు తరలించింది. అయితే క్వాలిఫయర్‌-1 మాత్రం చిదంబరం మైదానంలోనే జరగనుంది. ఇక క్వాలిఫయర్‌-2, ఎలిమినేటర్‌ మ్యాచులు హైదరాబాద్‌లో జరగాల్సి ఉండగా.. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా భద్రతకు ఇబ్బంది కలుగుతుందని విశాఖకు తరలించారు. మే 7న క్వాలిఫయర్‌ 1, మే 8న ఎలిమినేటర్‌, మే 10న క్వాలిఫయర్‌ 2, మే 12న ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతాయి.