RCB vs RR: వర్షం కారణంతో మ్యాచ్ రద్దు...!

SMTV Desk 2019-05-01 12:20:57  ipl 2019, rcb vs rr, virat kohli

బెంగళూరు: మంగళవారం రాత్రి బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఎడతెరపిలేని వర్షం కారణంగా దాదాపు మూడు గంటల మ్యాచ్ సమయం వేస్ట్ అవడంతో అంపైర్లు మ్యాచ్‌ని 5 ఓవర్లకే పరిమితం చేశారు. ఇక టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేయగా.. ఛేదనలో దూకుడుగా ఆడిన రాజస్థాన్ 3.2 ఓవర్లు ముగిసే సమయానికి 41/1తో నిలిచింది. ఈ దశలో మళ్లీ వర్షం రావడంతో.. ఇక మ్యాచ్ కొనసాగే అవకాశం లేనందుకు మ్యాచ్‌ని అంపైర్లు రద్దు చేశారు దీంతో ఫలితం మాత్రం ఎటు తేలలేదు. అయితే...రెండు జట్లకీ చెరొక పాయింట్ లభించింది. ఇక బెంగళూరు జట్టు చివరి మ్యాచ్‌ని హైదరాబాద్‌తో ఆదివారం ఆడనుంది. తొలి ఓవర్‌లోనే వరుణ్ అరోన్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదిన బెంగళూరు ఓపెనర్లు విరాట్ కోహ్లి (25: 7 బంతుల్లో 1x4, 3x6), ఏబీ డివిలియర్స్ (10: 4 బంతుల్లో 2x4) ఏకంగా 23 పరుగులతో జట్టుకి మెరుపు ఆరంభాన్నిచ్చారు. కానీ.. రెండో ఓవర్ వేసిన స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్ హ్యాట్రిక్ వికెట్లతో బెంగళూరు జోరుకి బ్రేక్‌లేశాడు. తొలి రెండు బంతుల్నీ సిక్స్, ఫోర్ బాదిన విరాట్ కోహ్లి నాలుగో బంతికి ఔటవగా.. తర్వాత వరుసగా డివిలియర్స్, స్టాయినిస్ (0) కూడా పెవిలియన్‌కి చేరిపోయారు. తాజా సీజన్‌లో ఇదే తొలి హ్యాట్రిక్ ప్రదర్శన. ఆ తర్వాత వచ్చిన క్లాసెన్ (6), గుర్‌కీరత్‌మన్ (6), పార్థీవ్ పటేల్ (8), పవన్ నేగి (4) దూకుడుగా ఆడే ప్రయత్నంలో వికెట్ చేజార్చుకున్నా విలువైన పరుగులు చేశారు. అనంతరం ఛేదనలో రాజస్థాన్ రాయల్స్‌కి ఓపెనర్లు సంజు శాంసన్ (28: 13 బంతుల్లో 2x4, 3x6), లివింగ్‌స్టోన్ (11 నాటౌట్: 7 బంతుల్లో 1x4, 1x6) దూకుడుగా ఆడి మెరుగైన ఆరంభమిచ్చారు. కానీ.. ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన చాహల్ బౌలింగ్‌లో శాంసన్ ఔటవగానే.. మళ్లీ వర్షం మొదలైంది. దీంతో.. మ్యాచ్‌ని రద్దు చేశారు. 13 మ్యాచ్‌లాడిన రాజస్థాన్ ఐదు విజయాలు, ఒక మ్యాచ్ రద్దుతో ఒక పాయింట్‌ ఖాతాలో వేసుకుని మొత్తం 11 పాయింట్లతో ఐదో స్థానానికి ఎగబాకి ప్లేఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకోగా.. 13 మ్యాచ్‌ల్లో ఎనిమిదింట్లో ఓడి, ఒక రద్దుతో మొత్తం 9 పాయింట్లని ఖాతాలో వేసుకున్న బెంగళూరు చిట్టచివరి స్థానానికే పరిమితై.. ప్లేఆఫ్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది.