హైదరాబాద్ లో ఇండ్లకు ఫుల్ డిమాండ్!

SMTV Desk 2019-04-30 19:20:46  home, hyderabad

హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో ఇళ్ల అమ్మకాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. మిగితా నగరాలతో పోలిస్తే అక్కడ అమ్మకాలు తగ్గుతుండగా హైదరాబాద్ లో మాత్రం దూసుకుపోతున్నాయి. ప్రస్తుత సంవత్సరం జనవరి-మార్చి మధ్యకాలంలో రాష్ట్ర రాజధానిలో 7,059 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో నమోదైన 5,618 యూనిట్లతో పోలిస్తే ఇది 26 శాతం ఎక్కువ. ప్రాపర్టీ బ్రోకరేజ్… ప్రాప్‌ టైగర్ తన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. బెంగళూరు, కోల్‌కతా, ముంబై, చెన్నై, హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, గురుగ్రామ్, నోయిడా నగరాల్లో… ఇండ్ల అమ్మకాలు, నూతన ప్రాజెక్టుల ప్రారంభం ఆధారంగా నివేదికను తయారు చేశారు.గత ఏడాదితో పోలిస్తే గురుగ్రామ్‌లో ఇండ్ల అమ్మకాలు 10 శాతం పెరిగి 5,764 యూనిట్లు అమ్ముడయ్యాయని ప్రాప్‌ టైగర్ తెలిపింది. కోల్ కతాలో 8 శాతం, పుణెలో 5 శాతం, ముంబైలో 4 శాతం వృద్ధి కనిపించిందని పేర్కొంది. కాగా బెంగళూరులో గృహ విక్రయాలు గణనీయంగా తగ్గాయని నివేదిక వెల్లడించింది. గతంతో పోలిస్తే 23 శాతం క్షీణించి 8,402 యూనిట్లకు పరిమితమయ్యాయని తెలిపింది. చెన్నైలో 13 శాతం, అహ్మదాబాద్‌ లో 10 శాతం అమ్మకాలు తగ్గాయని పేర్కొంది. నోయిడాలో ఇళ్ల అమ్మకాలు అత్యధికంగా 50 శాతం పడిపోయాయని ప్రాప్‌ టైగర్‌ వెల్లడించింది.