రాహుల్ కు కేంద్రం నుండి నోటీసులు!

SMTV Desk 2019-04-30 16:31:16  rahul gandhi, congress party, central government, loksabha elections

న్యూఢిల్లీ: జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేంద్ర హోం శాఖ నోటీసులు జారీ చేసింది. రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడని, ఎన్నికల్లో పోటీకి అనర్హుడని దాఖలైన ఫిర్యాదుపై తాజాగా స్పందించిన హోం శాఖ ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని మంగళవారం నోటీసులు జారీ చేసింది. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి చేసిన ఫిర్యాదు ఆధారంగా కాంగ్రెస్ నేతకు నోటీసులు ఇస్తున్నామని తెలిపింది. పౌరసత్వంపై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని రాహుల్‌ను ఆదేశించింది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో బ్యాకప్స్‌ లిమిటెడ్‌ కంపెనీని రిజిస్టర్ చేసుకోడానికి సమర్పించిన పత్రాల్లో రాహుల్ పేరు డైరెక్టర్‌గా ఉందని స్వామి ఆరోపించారు. 2005-2006 పన్ను పత్రాల్లో రాహుల్ తన జాతీయను బ్రిటిష్‌గా పేర్కొన్నారని, కంపెనీ రద్దు కోసం పెట్టిన దరఖాస్తులోనూ తనను బ్రిటిష్ పౌరుడిగానే పేర్కొన్నారని చెప్పారు. దీంతో కేంద్రం రాహుల్‌కు నోటీసు జారీ చేసింది. స్వామి ఇవే ఆరోపణలతో 2015లో లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రామహాజన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. అవన్నీ అబద్ధాలని రాహుల్ తోసిపుచ్చారు. ఇటీవల ఆయన అమేఠీ లోక్ సభ స్థానంలో పోటీ చేయడానికి సమర్పించిన పత్రాల్లో తనను బ్రిటిష్ పౌరుడిగా పేర్కొన్నారని ధ్రువ్ అనే స్వతంత్ర అభ్యర్థి ఆరోపించారు. ఆయన నామినేషన్ చెల్లదని అన్నారు. అయితే నామినేషన్ పత్రాలు సరిగ్గానే ఉన్నాయని ఈసీ స్పష్టం చేసింది.