ధోని ని మోసం చేసిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ

SMTV Desk 2019-04-28 12:59:16  MS Dhoni,

ఢిల్లీ: ఆమ్రపాలి అనే రియల్ ఎస్టేట్ సంస్థ తనని మోసం చేసిందని టీం ఇండియా వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాడు. ఆ సంస్థ తనకు చెల్లించాల్సిన యాడ్ డబ్బులు ఇవ్వకపోగా సదరు కంపెనీకి సంబంధించిన పెంట్ హౌజ్‌ను కొనుగోలు చేశానని, యాజమాన్య హక్కులను తనకు కల్పించలేదన్నాడు. 2009 నుంచి 2016 మధ్య కాలంలో ఆమ్రపాలి అనే సంస్థకు ప్రచారకర్తగా ధోని పని చేశాడు. ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ధోనీని మధ్యలో కంపెనీ నిలిపివేసింది. ప్రస్తుతం ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ అనే వ్యాపార సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. 46 వేల మంది వినియోగదారులు తమ దగ్గర డబ్బులు తీసుకొని ఇండ్లు ఇవ్వడం లేదని ఆమ్రపాలి సంస్థపై కోర్టులో కేసులు వేశారు. గతంలో సుప్రీం కోర్టు ఆ సంస్థకు సంబంధించిన డైరెక్టర్లు, ఉప సంస్థలు తమ ఆస్తుల వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల క్రితం ఆ సంస్థ సిఎండి అనిల్ శర్మ, ఇద్దరు డైరెక్టర్లు శివ్ దీవాని, అజయ్ కుమార్‌లను అరెస్టు చేశారు. ఆ సంస్థతో సంబంధం ఉన్న ఒక ఉపసంస్థలో ధోని భార్య సాక్షికి కూడా వ్యాపార సంబంధాలు ఉన్నట్టు సమాచారం.