మరో విద్యార్ధిని ఆత్మహత్య

SMTV Desk 2019-04-27 19:17:05  Inter, suicide

ఇంటర్ పరీక్షలలో ఫెయిల్ అయిన 3.28 లక్షల మంది విద్యార్దుల పరీక్షాపత్రాలను మళ్ళీ రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ చేయడానికి ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తుంటే, మరోపక్క పరీక్షలలో ఫెయిలైన విద్యార్దుల ఆత్మహత్యలు చేసుకొంటూనే ఉన్నారు. నిన్నటి వరకు మొత్తం 22 మంది విద్యార్దులు ఆత్మహత్యలు చేసుకోగా ఈరోజు మరో విద్యార్ధిని ఆత్మహత్య చేసుకొంది.

నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండలంలోని కొండ్రోన్‌పల్లి గ్రామానికి చెందిన వెంకట్రామిరెడ్డి, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె శిరీష (17) శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకొంది. ఆమె ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు వ్రాయగా, జువాలజీ సబ్జెక్టులో ఫెయిల్ అవడంతో తీవ్ర మనస్తాపం చెందింది. ఈరోజు ఉదయం తన ఇంట్లో మేడమీద గదిలోకి వెళ్ళి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఒంటికి నిప్పంటించుకొంది ఆ తరువాత ఆ బాధ భరించలేక మేడపై నుంచి దూకడంతో తలకు తీవ్ర గాయమై చనిపోయింది. ధన్వాడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

శిరీష వంటి విద్యార్దులు కేవలం ఫెయిల్ అయ్యామనే కారణం చేతే ఆత్మహత్యలు చేసుకొంటున్నారనుకోలేము. ఫెయిల్ అయినందుకు తల్లితండ్రులు కోప్పడటం, ఇంటర్ ఫలితాలు వెలువడినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలు, విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ ఏ తప్పు జరుగలేదన్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ సమర్ధింపులు, రీ-కౌంటింగ్ చేయాలని నిర్ణయం తీసుకోవడంలో జరిగిన జాప్యం, వీటన్నిటి కారణంగా భవిష్యత్తు గురించి బెంగ వంటివన్నీ విద్యార్దులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కనుక మళ్ళీ ఇంటర్ ఫలితాలు వెలువడేవరకు ఫెయిల్ అయిన విద్యార్దులు అందరూ ధైర్యంగా ఉండాలి. తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు, బందువులు, స్నేహితులు కూడా వారికి అండగా నిలబడటం చాలా అవసరం.