ఏపీకి 'ఫణి' బెడద

SMTV Desk 2019-04-27 12:29:35  tsunami, fani tsunami, andhrapradesh, telangana

అమరావతి: తెలుగు రాష్ట్రాలకు తుఫాను సంభవించే అవకశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖా అధికారులు ఇప్పటికే అనేకసార్లు హెచ్చరించారు. బంగాళా ఖాతం, హిందూ మహాసముద్రం మధ్య ఈ నెల 26వ తేదీన ఏర్పడే అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా.. ఆ తర్వాత 12 గంటల్లో తుఫానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు (ఐఎండీ) తెలిపారు. ఏపీ, తమిళనాడు తీరం వెంట విరుచుకుపడనున్న ఈ తుఫాన్‌కు ‘ఫణి’ అనే పేరు ఖరారు చేశారు. ఈ తుఫాన్‌కు బంగ్లాదేశ్‌ నామకరణం చేసింది. ఫణి తుఫాన్ కారణంగా రాబోయే 72 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. తుఫాన్ తీరం దాటే సమయంలో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఫణి తుఫాన్ మంగళవారం (ఏప్రిల్ 30) ఉదయం తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. మంగళవారం శ్రీలంక తీరాన్ని తాకి ఆ తర్వాత ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర వైపుగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాబోయే 24 గంటల్లో తుఫాన్ దిశ మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఫణి తుఫాన్ ప్రభావంతో ఆది, సోమ, మంగళ వారాల్లో తమిళనాడు తీరం, పుదుచ్చేరి వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. కేరళ, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. శుక్రవారం ఉదయం వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం.. శ్రీలంక తీరంలోని ట్రింకోమలికి తూర్పు ఆగ్నేయ దిశగా 1140 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్ల అధికారులు తెలిపారు. చెన్నైకు ఆగ్నేయంగా 1490 కి.మీ., మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయ దిశగా 1760 కి.మీ దూరంలో ఈ వాయుగుండం కదులుతున్నట్లు తెలిపారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కి.మీ. వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను హెచ్చరించారు.