వైసీపీకి ఓటేసినందుకు మహిళలను గ్రామా బహిష్కరణ చేసిన టిడిపి నేతలు

SMTV Desk 2019-04-25 15:41:13  tdp, ysrcp, voters

అమరావతి: ఎన్నికల్లో చంద్రబాబుకు కాకుండా వైసీపీకి ఓటు వేశారని మహిళలను గ్రామా బహిష్కరణ చేశారు టిడిపి నేతలు. పూర్తి వివరాల ప్రకారం చంద్రగిరి కోట గ్రామంలో శశిధర్‌, భార్య కరుణ నివాసముంటున్నారు గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరుణతో పాటు మరో మహిళ స్వామి వారికి హారతి ఇవ్వడానికి వెళ్లారు. అయితే అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మునిచంద్ర, గిరి, వెంకట్రాయులు, రాజేంద్రతో పాటు మరికొందరు టీడీపీ నాయకులు కరుణ హారతిని పక్కకు నెట్టేశారు. మీరు వైసీపీకి ఓటు వేశారు అందుకే మిమ్మల్ని గ్రామం నుంచి బహిష్కరించామంటూ బెదిరింపులకు దిగారు. దీనిని ఆమె ఆక్షేపించి, నిలదీయడంతో కరుణతో పాటు మరికొందరు మహిళలను టీడీపీ నాయకులు నీచమైన భాషలో దుర్భాషలాడారు. దౌర్జన్యానికి పాల్పడ్డారు. గ్రామంలో జరిగే కార్యక్రమాలకు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారని.. దీంతో బాధితులు వాపోయి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న వైసీపీ నేతలు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని, బాధితులకు అండగా నిలిచారు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేసిందేమీ లేదని అందుకే మాకు నచ్చిన పార్టీకి మద్దతివ్వడం తప్పా అని బాధిత మహిళలు ప్రశ్నించారు. కోట గ్రామంలోని టీడీపీ నాయకులు వ్యవహరించిన తీరు దారుణమని నిరసించారు.