ఎమ్మెస్కే ప్రసాద్ పేరుతో ఘరానా మోసం

SMTV Desk 2019-04-25 13:13:40  Msk Prasad, Chief selector Team India, Indian cricket committee, Ajinkya Rahane, Rishab pant, Vijay shankar, icc world cup 2019, nagaraju created fake id in trucaller as msk prasad

విశాఖపట్నం: ఇండియన్ క్రికెట్ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పేరుతో ఓ వ్యక్తి కొంతమంది నుండి లక్షల రూపాయలు దోచేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి శ్రీకాకుళం జిల్లాకు చెందిన బుడుమూరి నాగరాజుగా గుర్తించారు. ఈ ఘటనపై ఇప్పటికే విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పూర్తి వివరాల ప్రకారం...నాగరాజు తన ఫోన్ నంబర్‌ను ట్రూకాలర్‌ యాప్‌లో ఎమ్కెస్కే ప్రసాద్‌గా రిజిస్టర్ చేశాడు. ఆ నంబర్‌తో కొంత మంది పారిశ్రామికవేత్తలకు ఫోన్లు చేసి నాగరాజు అనే వ్యక్తి కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు సభ్యుడిగా ఎంపికయ్యాడని, అతన్ని స్పాన్సర్ చేయాలని కోరాడు. ట్రూకాలర్‌లో ఎమ్మెస్కే ప్రసాద్ అని రావడంతో మాట్లాడింది ఆయనేనని నమ్మిన కొంతమంది వ్యాపారవేత్తలు నాగరాజు ఖాతాలోకి డబ్బులు బదిలీ చేశారు. సెలెక్ట్ టెలీ కంపెనీ నుంచి రూ.2.88 లక్షలు, రామక్రిష్ణ హౌసింగ్ సంస్థ నుంచి రూ.3.88 లక్షలు నాగరాజు ఖాతాలోకి బదిలీ అయినట్లు ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. దీనిపై అనుమానం వ్యక్తం చేసిన కొంత మంది వ్యాపారవేత్తలు ఎమ్మెస్కే ప్రసాద్‌కు ఫోన్ చేశారు. దీంతో విషయం ఆయనకు తెలిసింది. వెంటనే హైదరాబాద్, విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఎమ్మెస్కే ప్రసాద్ ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన నిందితుడు నాగరాజును గుర్తించారు. అయితే, ఈ ఘటనపై ఇప్పటికే ఓ కంపెనీ హైదరాబాద్‌లో కేసు పెట్టిన వార్త విని షాక్‌కు గురయ్యానని ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు. విషయం తనకు చాలా ఆలస్యంగా తెలిసిందన్నారు. ఇదిలా ఉంటే, బుడుమూరి నాగరాజు ఫేస్‌బుక్ ఖాతాను పరిశీలిస్తే అతను భారత క్రికెటర్‌గా చెప్పుకుంటున్నాడు. ఐపీఎల్ క్యాంప్‌లో ప్రాక్టీస్ చేస్తున్నట్లు వీడియోలు తయారుచేసి పోస్ట్ చేస్తున్నాడు.