నా మొబైల్ ఫోన్‌కు ఒక విచిత్రమైన మెసేజ్ వచ్చింది

SMTV Desk 2019-04-25 11:22:51  Amit Shah, BJP

బిహార్‌లోని ముంగేర్‌ జిల్లాలో లోక్‌సభ ఎన్నికల ప్రచారసభలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పాటవుతున్న మహాకూటమిని ఉద్దేశ్యించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “నా మొబైల్ ఫోన్‌కు ఒక విచిత్రమైన మెసేజ్ వచ్చింది. ఒకవేళ ఆ మహా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే రోజుకొకరు చొప్పున ప్రధానమంత్రిగా వ్యవహరిస్తారంటూ దాని సారాంశం. సోమవారం మమతా బెనర్జీ, మంగళవారం అఖిలేశ్ యాదవ్, బుదవారం మాయావతి, గురువారం లాలూ ప్రసాద్ యాదవ్, శుక్రవారం చంద్రబాబునాయుడు, శనివారం దేవగౌడ ప్రధానమంత్రులుగా వ్యవహరిస్తారట...ఆదివారం శలవు తీసుకొంటారట! కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి వస్తే జరుగబోయేది ఇదే. గత కాంగ్రెస్ హయాంలో సరిహద్దుల వద్ద రోజూ మన సైనికులు చనిపోతున్నా, దేశంలో ఉగ్రవాదులు బాంబులు పేల్చుతున్నా అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఏమీ చేయలేక చేతులుముడుచుకొని కూర్చోన్నారు. కానీ ప్రధాని నరేంద్రమోడీ వచ్చిన తరువాత పరిస్థితి మారింది. ఉగ్రవాదులు దేశంవైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడుతున్నారు. కనుక మనకు కేంద్రంలో అటువంటి అస్థిరమైన ప్రభుత్వం కావాలా లేక సుస్థిరమైన, శత్రువులను సమర్ధంగా తిప్పికొట్టగల బలమైన ప్రభుత్వం కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి,” అని అన్నారు.

ఎన్నికలలో గెలిచేందుకు వ్యూహాలు ఎంత అవసరమో ప్రజలను ఆకట్టుకొనే మాటకారితనం అంతా కంటే అవసరం. ఒక ఊహాజనితమైన విషయాన్ని అతిశయోక్తిగా వర్ణిస్తూ అమిత్ షా ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారని అర్ధం అవుతూనే ఉంది. ఒకవేళ కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి వస్తే రాగల 5 ఏళ్ళలో కనీసం ఒక్కసారైనా ప్రధానమంత్రి మారే అవకాశం ఉండవచ్చు.