టిక్‌టాక్ లో కేసీఆర్ వీడియోలు: యువకుడు అరెస్ట్

SMTV Desk 2019-04-24 15:51:30  tik tok, kcr, kcr videos in tik tok, cyber crime, hyderabad, telangana cm, ap guy arrest

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై టిక్‌టాక్ వీడియోలను ఎడిట్ చేసి ఉంచిన వైనంపై టిఆర్‌ఎస్ నాయకులు సైబర్ క్రైం పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వీడియోలు తీసిన యువకుడు తాజాగా అరెస్ట్ అయ్యాడు. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీస్ విభాగం కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా తిరువూరు గ్రామానికి చెందిన తగరం నవీన్‌(20) డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. అతను ఈనెల 14న తన స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుక జరుపుకున్నాడు. అయితే ఈ వేడుకలో బాగా మద్యం సేవించిన నవీన్ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా తన ఇష్టమొచ్చిన రీతిన తిట్టాడు. అంతటితో ఆగకుండా అదంతా వీడియో తీసి టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేశాడు. అనంతరం సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో కూడా పోస్ట్ చేశాడు.ఆ వీడియో కాస్తా వైరల్ అవడంతో తీవ్ర సంచలనంగా మారింది. ఈ వీడియోపై టీఆర్ఎస్‌వీ(తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం) రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నర్సింహ్మగౌడ్ రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నవీన్‌ను బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 153(ఏ), ఐటీ యాక్ట్ సెక్షన్ 67ల కింద కేసులు నమోదు చేశారు. అతని వద్ద వున్న రెడ్ మీ వై2, రెడ్ మీ 4 స్మార్ట్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా ఇలా ప్రభుత్వాధినేతలు, అధికారుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని, చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.