ప్రధాని కాదు...సైన్యంలోకి చేరాలనుకున్నా: మోదీ

SMTV Desk 2019-04-24 15:31:33  narendra modi with akshay kumar, pm modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ....ప్రధాని అవుతానని తాను కలగనలేదని, సైన్యంలో చేరాలని అనుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. అనుకోని పరిస్థితుల్లో రాజకీయరంగంలోకి వచ్చినట్టు మోదీ వెల్లడించారు. ప్రముఖల జీవిత కథలను చదవడం నాకు ఇష్టం, అలాగే నేను అంకితభావం కలిగిన కార్యకర్తను, రామకృష్ణ మిషన్ నాకు స్పూర్తి కలిగించింది. అని ఆయన పేర్కొన్నారు. ఎవరిపై కోపాన్ని ప్రదర్శించనని, భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటానని ఆయన చెప్పారు. అన్ని పార్టీల్లో తనకు మిత్రులు ఉన్నారని, తాను పని చేస్తూ , అందరితో పని చేయిస్తానని ఆయన తెలిపారు. అందరితో సరదాగా గడపాలనుకుంటానని, సమయాన్ని వృథా చేయడం తనకు ఇష్టముండదని ఆయన పేర్కొన్నారు. పని ఒత్తిడిలో ఉన్నా కూడా వీలు కలిగినప్పడు తన తల్లిని కలుస్తానని ఆయన చెప్పారు. దేశ ప్రజల సంక్షేమమే తన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. తన జీవితాంతం ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తానని ఆయన తెలిపారు. తన తుది శ్వాస వరకు ప్రజలతోనే ఉంటానని ఆయన తేల్చి చెప్పారు. ప్రత్యర్థి పార్టీల నేతలు తనపై విమర్శలు చేసినప్పటికీ, తాను సానుకూల దృక్పథంతోనే ముందుకు సాగుతానని ఆయన పేర్కొన్నారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం పార్టీలతీతంగా అందరినీ కలుపుకొని పోతానని ఆయన చెప్పారు. భారత్ వంటి లౌకిక దేశం ప్రపంచంలో ఎక్కడా లేదని, సర్వమత సమ్మేళనంగా భారత్ వర్థిల్లుతుందని ఆయన వెల్లడించారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని తాను ముందుకు సాగుతానని ఆయన చెప్పారు.