రాహుల్ గాంధీకి కోర్టు ధిక్కార నోటీస్ జారీ

SMTV Desk 2019-04-24 12:15:33  rahul gandhi, congress party, bjp, narendramodi, chowki daari he, election commission, loksabha elections, bjp leaders, supreme court

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చౌకిదార్‌ చోర్ హై అంటూ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ కామెంట్స్‌ పై బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించడంతో రాహుల్ గాంధీ సూప్రీంకోర్టుకు వివరణ కూడా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో చౌకిదార్‌ చోర్ హై అని మాట దోర్లిందన్నారు. అయితే తాజాగా మళ్ళీ రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు మంగళవారం కోర్టు ధిక్కార నోటీస్ జారీ చేసింది. రాఫెల్ పై వెలువరించిన తీర్పును ప్రస్తావిస్తూ…మోదీపై చేసిన వ్యాఖ్యలపై కోర్టు ఈ నోటీస్ ఇచ్చింది. అది తప్పుగా ఆపాదించబడిన వ్యాఖ్య అని పేర్కొంది. రాహుల్‌కు వ్యతిరేకంగా బిజెపి ఎంపి మీనాక్షిలేఖి దాఖలు చేసిన ‘నేరపూరిత ధిక్కార’ పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం ఏప్రిల్ 30న విచారణ జరుపుతుంది. దాంతో పాటు… రాఫెల్ ఫైటర్ జెట్ ఒప్పందంపై 2018 డిసెంబర్ 14న వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ పెండింగ్‌లో ఉన్న రివ్యూ పిటిషన్‌పై కూడా అదే రోజు విచారణ జరుగుతుంది. లేఖి దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ను డిస్మిస్ చేయవలసిందిగా కోరుతూ రాహుల్‌గాంధీ చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాహుల్‌గాంధీ తరఫున సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీ చేసిన వాదనను విన్న తర్వాత …ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ సారథ్యంలోని ధర్మాసనం …రెస్పాండెంట్ గాంధీకి నోటీస్ ఇవ్వడమే సముచితమని మేము పరిగణిస్తున్నాము… అని పేర్కొంది. ఈ పిటిషన్‌తో పాటు రివ్యూ పిటిషన్‌ను కూడా వచ్చే మంగళవారం నాటికి లిస్టింగ్ చేయవలసిందిగా కూడా కోర్టు రిజిస్టరీని ఆదేశించాం’ అని న్యాయమూర్తులు దీపక్ గుప్తా, సంజీవ్‌ఖన్నాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. రాఫెల్ తీర్పుపై తన వ్యాఖ్యకు విచారం వ్యక్తం చేస్తూ గాంధీ దాఖలు చేసిన అఫిడవిట్‌లో విషయమేమిటో వివరించవలసిందిగా లేఖి తరఫున వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీని ధర్మాసనం ఆదేశించింది. రాజకీయ భావావేశంలో తను ఆ వ్యాఖ్యలు చేసినట్టు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. నేరపూరిత కోర్టు ధిక్కార పిటిషన్‌పై విచారణకు రాహుల్‌గాంధీ వ్యక్తిగతంగా హాజరు కానక్కర్లేదని సుప్రీంకోర్టు మంగళవారం మినహాయింపునిచ్చింది. ‘కోర్టు ధిక్కారానికి పాల్పడినట్టు భావిస్తున్న వ్యక్తి ప్రస్తుతానికి న్యాయస్థానానికి హాజరు కానవసరం లేదు’ అని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ సారథ్యంలోని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాన్ని జారీ చేసిన పిమ్మట లేఖి తరఫు న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి విలేకరులతో మాట్లాడుతూ… సుప్రీం కోర్టు ఇచ్చిన నోటీస్ ఇచ్చినందువల్ల …తన వ్యాఖ్యపై వివరణ ఇచ్చేందుకు రాహుల్‌గాంధీ వ్యక్తిగతంగా న్యాయస్థానం ఎదుట హాజరు కావలసి ఉంటుందని చెప్పారు.