వారిని చూస్తే కొన్నిసార్లు బంతి ఎక్కడ ఎస్తానో కూడా తెలీదు: చాహల్

SMTV Desk 2019-04-23 18:19:48  chahal, rcb, ipl 2019, virat kohli, ab de villars

న్యూఢిల్లీ: ఐపీఎల్ తనకొక కుటుంబంలాంటిదని అందులో ఉన్నని రోజులు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టులోనే ఆడుతా అని ఆర్సీబీ ఆటగాడు యుజువేంద్ర చాహల్‌ అన్నాడు. తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్‌ మాట్లాడుతూ.... 2014లో ఐపీఎల్‌లో అడుగుపెట్టినప్పుడు ఇన్ని సంవత్సరాలు ఒకే జట్టుకు ఆడతానని అనుకోలేదు. ఆర్సీబీకి ఆడటాన్ని ఎంతో ఆస్వాదిస్తా. జీవితాంతం ఆర్సీబీ జట్టుకే ఆడాలనుకుంటున్నా. చిన్నస్వామి మైదానంలో ఆడే సమయంలో అభిమానుల మద్దతు ఎంతో ఉంటుంది. అభిమానుల కోలాహలంతో కొన్ని సార్లు బంతి ఎక్కడ వేస్తున్నానో కూడా అర్థం కాదు. కోహ్లీ గురించి చెప్పాలంటే.. జట్టు కెప్టెన్‌ మనకు వెన్నంటి ఉంటే ఏ ఆటగాడైనా మంచి ప్రదర్శనలు ఇవ్వగలడు. కోహ్లీ అదే చేస్తుంటాడు. టీమ్‌ యాజమాన్యం తెరవెనకాల నుండి సహకరిస్తుంది. ప్రతి బంతికి వికెట్‌ తీయాలన్న కసితో బౌలింగ్‌ చేయాలని కోహ్లీ అంటుంటాడు. పరుగులు పోయినా పట్టించుకోవద్దని సూచిస్తాడు. గత సంవత్సరం కూడా దాదాపు ఇదే బౌలింగ్‌ విభాగంతో ఉండి మంచి ప్రదర్శన ఇచ్చాం. అయితే ఎవరో ఒకరు.. ఏదో ఒక మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన ఆ ఆటగాడిని నిందించడం సరికాదు. దాదాపు మా జట్టులోని బౌలర్లంతా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్నవాళ్లే. అంతర్జాతీయ మ్యాచుల్లో ఆడిన అనుభవం ఐపీఎల్‌లో ఉపయోగపడతుంది. విరాట్‌ కోహ్లీ, డివిలియర్స్‌ కలిసి డ్రెస్సింగ్‌ రూం పంచుకోవడం నిజంగా అదృష్టం. ప్రపంచకప్‌కు ముందు 14 మ్యాచుల ఆట మంచి ప్రాక్టీస్‌లా పనికొస్తుందని నా అభిప్రాయం అని చాహల్‌ తెలిపాడు. 28 ఏళ్ల ఈ లెగ్‌ స్పిన్నర్‌ ఇప్పటి వరకూ 14 వికెట్లు తీసి ఆర్సీబీ తరఫున అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టుకు చాహల్‌ ఎంపికైన విషయం తెలిసిందే.