పసుపు కుంకుమ, వృద్ధాప్య పింఛన్లే టీడీపీని గెలిపిస్తాయి

SMTV Desk 2019-04-22 17:29:54  Pasupu Kunkuma, TDP,

టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి సోమవారం అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఈ తరుణంలో ఎన్నికల్లో టీడీపీదే గెలుపని స్పష్టం చేశారు. పసుపు-కుంకుమ, వృద్ధాప్య పింఛన్ పథకాలే టీడీపీని గెలిపిస్తాయని ఆయన అన్నారు. చంద్రబాబు 120 సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే ఒక్కరైనా అభినందించారా అని ప్రశ్నించారు. సంక్షేమ కార్యక్రమాలను ఎవరూ పట్టించుకోవట్లేదని, పసుపు కుంకుమ, వృద్ధాప్య పింఛన్లే లేకపోతే మా గతి అథోగతయ్యేదని ఆయన అన్నారు

అలాగే ఎన్నికల ఖర్చు గురించి కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి రూ.10 వేల కోట్లు ఖర్చు చేశాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కో అభ్యర్థి కనీసం రూ.25 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థుల మొత్తం ఖర్చు రూ.50 కోట్లు దాటిందన్నారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టడం తగ్గించాలనేది తన తపన అని వివరించారు. ఇందుకోసం జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జయప్రకాశ్‌ నారాయణ లాంటి మేధావులతో కలిసి వేదికను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇక ముందు ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రూ.5 వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పారు. డబ్బు కాదు.. చేసిన పనులను ప్రస్తావిస్తూ ఓట్లు అడిగే పరిస్థితి రావాలన్నారు. అందుకోసం కృషి చేస్తానని వివరించారు.