కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయింది

SMTV Desk 2019-04-21 11:56:13  dk aruna, congress

ఇటీవల బిజెపిలో చేరిన సీనియర్ కాంగ్రెస్‌ నాయకురాలు డికె.అరుణ శుక్రవారం నల్గొండ బిజెపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయింది. జాతీయస్థాయిలో కూడా ప్రజల ఆదరణ కోల్పోయింది. మళ్ళీ నరేంద్రమోడీయే ప్రధాని కావాలని దేశప్రజలు కోరుకొంటున్నారు. రాష్ట్రంలో తెరాసకు బిజెపి మాత్రమే ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. తెరాస సర్కార్ అవినీతిని, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సిఎం కేసీఆర్‌ రెవెన్యూశాఖపై అవినీతిముద్ర వేస్తున్నారు. తెరాస ప్రభుత్వంలో అవినీతి జరిగితే దానికి తెరాస నేతలు బాధ్యులా లేక రెవెన్యూ అధికారులా? సిఎం కేసీఆర్‌ తొందరపాటుతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటూ రెవెన్యూచట్టాలను మార్చితే తీవ్ర సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని గ్రహిస్తే మంచిది. లోక్‌సభ ఎన్నికలలో తప్పకుండా 16 సీట్లు గెలుచుకొంటామని చెప్పుకొంటున్న కేసీఆర్‌ వాటి ఫలితాలు రాకమునుపే ఓటమి భయంతోనే హడావుడిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు,” అని అన్నారు.

ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం పోయిందనే విషయాన్ని ఆమె అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన తరువాత తెలుసుకొన్నారో లేక బిజెపిలో చేరాక ఆమెకు ఆ అభిప్రాయం కలిగిందో తెలియదు కానీ ఆమె మాటలలో ఎంతో కొంత నిజముందని చెప్పక తప్పదు. కానీ నేటికీ రాష్ట్రంలో బిజెపి కంటే కాంగ్రెస్ పార్టీయే చాలా బలంగా ఉందనే సంగతి అసెంబ్లీ ఎన్నికలలో రుజువయింది. ఒకవేళ కాంగ్రెస్‌ పార్టీ ఇంకా బలహీనపడితే ఇక మిగిలేది బిజెపియే కనుక సహజంగానే తెరాసకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది. కానీ అంతమాత్రన్న తెరాసను ఎదుర్కొని నిలిచి రాష్ట్రంలో ఎప్పటికైనా అధికారంలోకి రాగలదా అంటే అనుమానమే.

లోక్‌సభ ఎన్నికలలో తెరాస 16, కాంగ్రెస్‌ 8-10 సీట్లు గెలుచుకొంటామని చెప్పగలుగుతున్నాయి. కానీ తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయంగా నిలుస్తామని చెప్పుకొంటున్న బిజెపి మాత్రం రాష్ట్రంలో ఎన్ని ఎంపీ సీట్లు గెలుచుకోగలదో డికె అరుణతో సహా బిజెపి నేతలెవరూ చెప్పలేకపోతున్నారు. వారు ఇప్పుడు చెప్పలేకపోయినా మే 23న రాష్ట్ర కాంగ్రెస్‌, బిజెపిలలో దేని బలం ఎంతో తేలిపోతుంది కదా!