జెర్సీ సినిమా రివ్యూ అండ్ రేటింగ్

SMTV Desk 2019-04-19 17:21:08  Jersey cinema, Review and Rating

చిత్రం : జెర్సీ (2019)

నటీనటులు : నాని, శ్రద్ధా శ్రీనాథ్‌, సత్యరాజ్‌, బ్రహ్మాజీ, సుబ్బరాజు, రాహుల్‌ రామకృష్ణ, సంపత్‌ రాజ్‌, ప్రవీణ్‌ తదితరులు

సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌

దర్శకత్వం: గౌతమ్‌ తిన్ననూరి

నిర్మాత : సూర్య దేవర నాగవంశీ

నిర్మాణ సంస్థ : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌

రిలీజ్ డేటు : 19ఏప్రిల్ 2019.

రేటింగ్ : 3.5/5

కథల ఎంపికలో మంచి అభిరుచి ఉన్న కథానాయకుడు నాని. ఆయన నటించిన తాజా చిత్రం జెర్సీ. గౌత‌మ్ తిన్న‌నూరి దర్శకుడు. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్. విడుదలకి ముందే హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ లాంటి పదాలు ఈ సినిమా ముందు చాలా చిన్నవి అన్నారు నాని. అంతకుమించిన విజయాన్ని జెర్సీ అందుకుంటుంది అన్నారు. మరీ.. అది నిజమేనా ? తెలుసుకొనేందుకు జెర్సీ రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

అర్జున్(నాని) ఓ క్రికెటర్. సారా (శ్రద్దా శ్రీనాధ్) అనే ఓ క్రిష్టియన్ అమ్మాయితో ప్రేమలో పడతాడు. వీరి వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవటంతో… అందరినీ కాదనుకుని బయిటకు వచ్చేసి పెళ్లి చేసుకుంటారు. ఎంత బాగా ఆడినా జాతీయ జట్టులో స్థానం రాకపోవడంతో 26 ఏళ్ల వయసులోనే క్రికెట్కి దూరం అవుతాడు. తర్వాత లంచ తీసుకొన్నారనే ఆరోపణతో స్పోర్ట్స్ కోటాలో వచ్చిన జాబ్ కూడా పోతుంది. రూ. 500 ఖర్చు పెట్టి.. తన కొడుకు అడిగిన జెర్సీ కొనిపెట్టలేకపోయానన్న కసితో చివరికి తాను వదిలేసిన క్రికెట్‌ను మళ్లీ మొదలెడతాడు అర్జున్. 36 ఏళ్ల వయసులో మళ్లీ జాతీయ క్రికెట్ జట్టులో స్థానం కోసం రంగంలోకి దిగుతాడు. మరి అర్జున్‌ ప్రయత్నం సఫలమైందా… తన కొడుకు నాని ఆనందం కోసం అర్జున్ ఏం చేశాడు అన్నదే జెర్సీ కథ.

ప్లస్ పాయింట్స్ :

* కథ-కథనం

* నాని నటన

* క్లైమాక్స్

* నేపథ్య సంగీతం

* భాగోద్వేగాలు

మైనస్ పాయింట్స్ :

* అక్కడక్కడ స్లో నేరేషన్

* సినిమా నివిడి

నటీనటుల ఫర్ ఫామెన్స్ :

అర్జున్ అనే క్రికెటర్ 26 ఏళ్ల వయసులోనే ఆటకు గుడ్ బై చెప్పి.. మళ్లీ పదేళ్ల తర్వాత ఎందుకు బ్యాట్ చేతబట్టాడు, ఏం సాధించాడు అనేది కథ. ఈ కథని స్క్రీన్ ప్లే తో ఎమోషనల్ రైడ్ గా మార్చటం ఆకట్టుకొంది. అర్జున్ జీవితంపై పుస్త‌కాన్ని ఆవిష్క‌రించి, . అత‌డి కొడుకు పాయింట్ ఆఫ్ వ్యూలో నేరేట్ చేయ‌డం మంచి ఎత్తుగడ. కథని 1986 .. 1996.. 2018 సంవత్సరాలలో చూపించిన తీరు ఆక‌ట్టుకుంది. ఎలాంటి కమర్షియల్ హంగులకి వెళ్లకుండా కథని చాలా సహజంగా చెప్పాడు దర్సకుడు గౌతమ్‌ తిన్ననూరి. ముఖ్యంగా నటుడుగా నాని బలాలు, బలహీనతలను కరెక్ట్ అంచనా వేసి ఆ కొలతల్లోనే సినిమాని పరుగెట్టించాడు.

ఇప్పటివరకూ నానిని హుషారైన పాత్రలో చూశాం. తన కెరీర్‌లో తొలిసారి అందుకు భిన్నమైన పాత్ర పోషించాడు. ఎమోషనల్‌ సీన్లలో తను ఎంత బాగా నటించగలడో ఈ సినిమాతో మరోసారి రుజువైంది. ఒక క్రికెటర్‌గా‌, ఒక ప్రేమికుడిగా ఎంత చక్కగా నటించాడో.. ఒక తండ్రిలా అంతే బాగా నటించాడు. ఒక కొడుకు కోసం సగటు తండ్రి పడే తపనను అద్భుతంగా చూపించాడు. సారాగా శ్రద్ధా శ్రీనాథ్ నటన బాగుంది. కథలోని కీలక సన్నివేశాల్లో ఆమె హావభావాలు బాగా పలికించింది. అర్జున్‌ తనయుడు నానిగా చేసిన బాలనటుడు కూడా చక్కగా నటించాడు. అర్జున్‌ కోచ్‌గా కనిపించిన సత్యరాజ్‌ నటించారు. సత్యరాజ్‌, నానిల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కమెడియన్ ప్రవీణ్, ఇతర కమెడియన్ల సీన్లు హాస్యాన్ని పంచుతాయి. సెకండాఫ్‌లో సంపత్ రాజ్ సినిమాకు మరింత బలంగా మారింది.

సాంకేతికంగా :

సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ బాగుంది. టాప్ యాంగిల్ షాట్స్ విజువల్ ట్రీట్‌ అని చెప్పవచ్చు. అనిరుధ్ రవిచందర్ అందించిన పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతంతో మేజిక్ చేశాడు. అది సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. సినిమాలో అన్నీ ప్లస్ లే. ఒక్క స్లో నేరేషన్ మాత్రమే మైనస్ గా మారింది. ప్రేక్షకుడు కథతో కనెక్ట్ కావడంతో అది పెద్ద మైనస్ గా అనిపించలేదు. కాస్త నివిడి తగ్గితే.. ఇంకా బాగుండేమో.. !

చివరగా : ఎమోషనల్ కంటెంట్, ఎంటర్‌టైన్‌మెంట్‌ను బ్యాలెన్స్ చేసిన సినిమా ఇది. అన్నీ వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది. ముఖ్యంగా మిడిల్ ఏజ్ లో నిసృహలో మునిగిపోయిన వారికి టానిక్ లా పని చేస్తుంది. మొత్తంగా.. జెర్సీ ఎమోషనల్ జర్నీ