రూ. 705 కోట్లు భాజపాకి... రూ. 198 కోట్లు కాంగ్రెస్ కి : ఎక్కడినుండి వచ్చిందొ తెలీదు

SMTV Desk 2017-08-18 12:12:50  BJP, Congress, Political party donations, Association of democratic rights, ADR

న్యూఢిల్లీ, ఆగస్ట్ 18: కొందరు ప్రముఖులకు రాజకీయ పార్టీలపై చాలా ప్రేమ పుట్టుకొస్తుంది. ఈ అంతులేని ప్రేమతో అధిక మొత్తంలో విరాళాలను కూడా పార్టీలకు కుమ్మరిస్తారు. అయితే గమ్మత్తు ఏమిటంటే ఆయా పార్టీలు ఈ భారీ విరాళాలు ఎవరు సమర్పించారో ప్రకటించవు. గత సంవత్సరం ఎన్నికల కమిషన్ ఈ విధానానికి చెక్ పెట్టడానికి ఒక వ్యక్తి సంవత్సరంలో రూ. 20 వేల కన్నా అధిక డొనేషన్‌ను ఇస్తే సదరు వ్యక్తి వివరాలు వెల్లడించాలంటూ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ నేపధ్యంలో గడచిన నాలుగేళ్ల వివరాలు పరిశీలిస్తే, విరాళం ఇస్తున్న వ్యక్తి పేరు, చిరునామా లేకుండా 3 వేలకు పైగా డొనేషన్స్ వివిధ పార్టీలకు వచ్చాయి. 2012 నుంచి 2016 మధ్య కాలంలో 1,933 మంది తమ పాన్ నంబర్ చెప్పకుండా రూ. 384 కోట్లను విరాళంగా ఇవ్వగా, 1,546 మంది పేరు, చిరునామా చెప్పకుండా రూ. 355 కోట్లు ఇచ్చారు. ఈ విరాళాలు అందుకున్న పార్టీలలో బీజేపీ రూ. 705 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, కాంగ్రెస్ ఖాతాకు రూ. 198 కోట్లు చేరగా రెండవ స్థానంలో నిలిచింది. దేశంలోని మిగతా పార్టీలన్నిటికి నామమాత్రంగానే డొనేషన్స్ అందాయి. బీఎస్పీ పార్టీకి రూ. 20 వేలకు మించిన స్వచ్ఛంద విరాళాలు రాలేదని తెలపడంతో ఈ సర్వేలో ఆ పార్టీని పరిగణించలేదని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రైట్స్ (ఏడీఆర్) తెలిపింది. కాగా, గత పది సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ కు రూ. 3,323 కోట్ల విరాళాలు రాగా, బీజేపీకి రూ. 2,125 కోట్ల విరాళం గుర్తు తెలియని వ్యక్తులద్వారా వచ్చింది. ఈ మొత్తం సర్వేను అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రైట్స్ (ఏడీఆర్) నిర్వహించింది.