మంత్రి పదవులకు బ్రేక్ వేసిన జగన్

SMTV Desk 2019-04-18 15:55:53  Jagan, YSRCP,

ఏపీ ఎన్నికల్లో గెలుపు ఎవరదినే దానిపై రాజకీయవర్గాల్లో ఇంకా క్లారిటీ రాలేదు. ప్రధాన రాజకీయ పార్టీలు... కచ్చితంగా గెలుపు తమదే అని నమ్మకంగా ఉన్నాయి. అయితే ఈ సారి తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రతిపక్ష వైసీపీ కాస్త ఎక్కువ ధీమాతో కనిపిస్తోంది. పార్టీ ముఖ్యనేతలు సైతం ఇప్పటికే తమ పార్టీ గెలవబోతోందంటూ పూర్తి స్థాయిలో రిలాక్స్ అయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్నా... కొత్త ప్రభుత్వంలో తమకు కేబినెట్ బెర్త్ దక్కుతుందా లేదా అనే అంశంపై అప్పుడే కొందరిలో టెన్షన్ మొదలైందని తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో కొత్త మంత్రులు వీరే అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.

దీనిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పుడే కసరత్తు కూడా మొదలుపెట్టారని... జిల్లాల వారీగా గెలిచే నేతలతో పాటు సామాజిక సమీకరణలను అంచనా వేసుకుంటూ మంత్రి పదవులకు నేతలను ఎంపిక చేస్తున్నారంటూ వైసీపీ వర్గాల్లోనూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొందరు నేతలు జగన్‌ను కలిసి కొత్త ప్రభుత్వంలో తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టు తెలుస్తోంది.

అయితే మంత్రిగా అవకాశం ఇవ్వాలని తన దగ్గరకు వస్తున్న నేతలెవరికీ వైఎస్ జగన్ స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఎవరిని కేబినెట్‌లోకి తీసుకోవాలో తనకు తెలుసని... అన్నీ అంశాలను పరిశీలించిన తరువాతే దీనిపై నిర్ణయం తీసుకుంటానని వైసీపీ అధినేత వారికి క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈ విషయంపై ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత మాట్లాడదామని ఆయన అంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో కొందరు అభ్యర్థులను గెలిపిస్తే మంత్రులను చేస్తానని బహిరంగంగానే ప్రకటించిన జగన్... మిగతా వారి విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో సీనియర్ నేతలు కొందరికి గెలుపుపై ఉత్కంఠతో పాటు గెలిచిన తరువాత మంత్రివర్గంలో చోటు దక్కుతుందా లేదా అనే సస్పెన్స్ కూడా కుదురుగా ఉండనివ్వడం లేదని ఊహాగానాలు జోరందుకున్నాయి.