సిఎస్‌కెపై సన్‌రైజర్స్ గెలుపు

SMTV Desk 2019-04-18 11:34:00  srh, csk,

డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బుధవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నైను 132 పరుగులకే పరిమితమైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 16.5 ఓవర్లలోనే కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ధాటిగా ఆడిన ఓపెనర్ డేవిడ్ వార్నర్ 25 బంతుల్లోనే పది ఫోర్లతో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ బైర్‌స్టో కూడా కీలక ఇన్నింగ్స్‌తో తనవంతు పాత్ర పోషించాడు. బైర్‌స్టో మూడు ఫోర్లు, మరో మూడు సిక్స్‌లతో అజేయంగా 61 పరుగులు చేశాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో హైదరాబాద్ బౌలర్లు సఫలమయ్యారు. ప్రారంభంలో సన్‌రైజర్స్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేశారు. ముఖ్యం తొలి ఐదు ఓవర్లలో చెన్నై స్కోరు నత్తనడకన సాగింది. భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్‌లు అద్భుత బౌలింగ్‌తో చెన్నై ఓపెనర్లు డుప్లెసిస్, షేన్‌వాట్సన్‌లను కట్టడి చేశారు. భువీ, ఖలీల్‌లు పిచ్ నుంచి లభించిన సహకారాన్ని సద్వినియోగం చేసుకుని ప్రత్యర్థి ఓపెనర్లను భారీ షాట్లు ఆడకుండా చేశారు. అయితే ఐదో ఓవర్‌లో సందీప్ శర్మ బౌలింగ్‌కు రావడంతో చెన్నై ఓపెనర్లు ఎదురుదాడికి దిగారు. ఈ ఓవర్‌లో 12 పరుగులు వచ్చాయి. తర్వాత డుప్లెసిస్, వాట్సన్ దూకుడును మరింత పెంచారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన వాట్సన్ 4 ఫోర్లతో 31 పరుగులు చేసి నదీమ్ వేసిన అద్భుత బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో 79 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. మరోవైపు దూకుడుగా ఆడిన డుప్లెసిస్ మూడు సిక్సర్లు, మరో 3 ఫోర్లతో 45 పరుగులు చేశాడు. చివర్లో హైదరాబాద్ బౌలర్లు మరింత పొదుపుగా బౌలింగ్ చేయడంతో చెన్నై స్కోరు 132 పరుగులకే పరిమిత మైంది.