ఎన్నికల ఖర్చు చూపకుంటే అభ్యర్థుల కథ కంచికే !!

SMTV Desk 2019-04-17 17:18:23  telangana, mptc elections, zptc elections

హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల సంఘం మరోసారి అభ్యర్థుల ఆటలు కట్టేందుకు సిద్దం అయ్యింది. గతంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌, వార్డు స్థానాల్లో పోటీ చేసిన మొత్తం 12,744 మంది నేతలపై చర్యలు తీసుకున్నది. వీరంతా మూడేండ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనకుండా వేటు వేసింది. 2014 పరిషత్‌ ఎన్నికల్లో పోటీ చేసిన 1,642 మంది అభ్యర్థులపై అనర్హత వేటు పడింది. వీరిలో 311 మంది జెడ్పీటీసీ, 1,331 మంది ఎంపీటీసీ అభ్యర్థులున్నారు. 2013 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన 11,102 మంది అభ్యర్థులపై కూడా అనర్హత వేటు పడింది. వీరిలో తొమ్మిది మంది సర్పంచ్‌లు, 1,300 వార్డు సభ్యులు ఉండగా సర్పంచ్‌లు గా పోటీ చేసి ఓడిపోయిన వారు 1,265 మంది, వార్డు సభ్యులుగా పోటీ చేసి ఓడిపోయిన వారు 8,528 మంది ఉన్నారు. ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకారం 2021 జనవరి 23 వరకు వీరు ఎన్నికల్లో పోటీకి దూరం కానున్నారు. ఎన్నికల ఖర్చుల లెక్కలు చెప్పాలంటూ ఎన్ని సార్లు నోటీసులు పంపించినప్పటికీ స్పందించకపోవడంతో వీరిపై అనర్హత వేటు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పరిషత్‌ ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వీరి జాబితాను జిల్లాలకు పంపించారు. జిల్లాల వారీగా అనర్హత వేటుపడిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. సర్పంచ్‌లలో జగిత్యాల జిల్లాలో ఆరుగురు, పెద్దపల్లిలో ఒకరు, కరీంనగర్‌లో ఇద్దరు చొప్పున ఉన్నారు. అనర్హత వేటు పడిన వార్డు సభ్యులలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఇద్దరు, జగిత్యాలలో 513, సిద్దిపేటలో 179, వరంగల్‌ అర్బన్‌లో 75, పెద్దపల్లిలో 168, కరీంనగర్‌లో 208, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 155 మంది ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్న వారిలో 11 జిల్లాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులుండగా 7 జిల్లాలో సర్పంచ్‌, వార్డు సభ్యులున్నారు. ఎక్కువగా నల్లగొండ జిల్లా నుంచి 81 మంది జెడ్పీటీసీ అభ్యర్థులున్నారు. వరంగల్‌ అర్బన్‌లో ఏడుగురు జెడ్పీటీసీ, 69 మంది ఎంపీటీసీ అభ్యర్థులున్నారు. సిద్దిపేటలో 8 మంది జెడ్పీటీసీ, 67 మంది ఎంపీటీసీ, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 8 మంది జెడ్పీటీసీ, 76 మంది ఎంపీటీసీ, నల్లగొండలో 81 మంది జెడ్పీటీసీ, 199 మంది ఎంపీటీసీ, జనగామలో నలుగురు ఎంపీటీసీ అభ్యర్థులు, సూర్యాపేటలో 55 మంది జెడ్పీటీసీ, 63 మంది ఎంపీటీసీ, యాదాద్రి భువనగిరిలో 32 మంది జెడ్పీటీసీ, 104 మంది ఎంపీటీసీ, రాజన్న సిరిసిల్లలో 13 మంది జెడ్పీటీసీ, 89 మంది ఎంపీటీసీ, కరీంనగర్‌లో 32 మంది జెడ్పీటీసీ, 282 మంది ఎంపీటీసీ, పెద్దపల్లిలో 31 మంది జెడ్పీటీసీ, 185 మంది ఎంపీటీసీ, జగిత్యాల జిల్లాలో 24 మంది జెడ్పీటీసీ, 141 మంది ఎంపీటీసీ అభ్యర్థులు, ఆయా పార్టీల నేతలపై వేటు వేస్తూ ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకున్నది.