ప్రేమను నిరాకరించిందని కత్తి నరికిన యువకుడు

SMTV Desk 2019-04-17 15:33:13  telangana crime, ranga reddy crime,

హైదరాబాద్, ఏప్రిల్ 17: తన ప్రేమను నిరాకరించిందన్న కారణంతో ఓ యువకుడు రెచ్చిపోయాడు. యువతి ఇంటికి వెళ్లి ఆమెపై కత్తితో దాడిచేశాడు. ఈ సందర్భంగా అడ్డు వచ్చిన యువతి తల్లిపై కూడా దాడిచేశాడు. దీంతో వారు గట్టిగా కేకలు వేయడంతో దుండగుడు ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని శంషాబాద్ ప్రాంతంలో రమేశ్ అనే యువకుడు ఉంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మరో యువతిని ప్రేమించిన రమేశ్, తనను ప్రేమించాల్సిందిగా వెంటపడ్డాడు. అయితే ఇందుకు యువతి నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి లోనయిన యువకుడు కత్తి తీసుకుని యువతి ఇంటికి వెళ్లాడు. ఆమెపై దాడికి దిగాడు. కుమార్తెపై దాడిని చూసినవెంటనే యువతి తల్లి రమేశ్ ను అడ్డుకుంది.

దీంతో ఆమెపై కూడా రమేశ్ దాడికి పాల్పడ్డాడు. వీరిద్దరి కేకలతో చుట్టుపక్కలవారు ఘటనాస్థలికి చేరుకోగానే, నిందితుడు భయంతో పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన శంషాబాద్ పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా, తల్లీకుమార్తెలకు తీవ్రగాయాలు కాగా, స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వీరిని చేర్పించి చికిత్స అందజేస్తున్నారు.