చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల పట్ల మాజీ ఐఏఎస్ అధికారులు ఆగ్రహం

SMTV Desk 2019-04-16 18:06:05  Chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర‌బాబుపై మాజీ ఐఏఎస్ అధికారులు భగ్గుమంటున్నారు. ఎన్నికల వేళ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం.. ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేదీలపై చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల పట్ల మాజీ ఐఏఎస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంట‌నే చంద్ర‌బాబు వారికి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేర‌కు గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ను క‌లిసి 33 మంది రిటైర్డ్ అధికారులు సంత‌కం చేసిన విజ్ఞాప‌న ప‌త్రాన్ని అందించారు.

ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఏపి రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనిల్ చంద్ర పునేఠాను విధ‌లు నుండి త‌ప్పించి, ఆయ‌న స్థానంల‌లో ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యంను నియ‌మించింది. దీంతో త‌మతో సంప్ర‌దింపులు లేకుండా ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌టంపై చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏపీ ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి కార్యాల‌యానికి వెళ్లి ద్వివేదీపై చంద్ర‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం ఓ కోవ‌ర్టు అంటూ వ్యాఖ్యానించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం.. జ‌గ‌న్ తోపాటుగా స‌హ ముద్దాయని ఆరోపించారు. అయితే, మాజీ ఐఏఎస్ అధికారులు మాత్రం ఎల్వీపైన ఉన్న కేసుల‌ను కోర్టు కొట్టివేసింద‌ని గవర్నర్‌కు వివ‌రించారు. భ‌విష్య‌త్‌లో ఇలా జ‌ర‌గ‌కుండా జోక్యం చేసుకోవాల‌ని గ‌వ‌ర్న‌ర్‌ను కోరారు. సీఈవో ద్వివేదికి, ఎల్వి సుబ్రమణ్యానికి చంద్రబాబు తక్షణమే క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు.