కోహ్లీ, ఆశిష్ నెహ్రా, పవన్ నేగిపై విమర్శల వర్షం

SMTV Desk 2019-04-16 17:51:49  ipl 2019, mi vs rcb, virat kohli, ashish nehra, pawan negi

ముంబై: సోమవారం రాత్రి వాంఖేడ్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ముంబయి గెలుపునకి ఆఖరి 12 బంతుల్లో 22 పరుగులు అవసరమవగా.. బౌలింగ్‌ కోచ్ ఆశిష్ నెహ్రా సూచన మేరకు 19వ ఓవర్‌‌ని స్పిన్నర్ పవన్ నేగితో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి వేయించాడు. కానీ.. ఆ ఓవర్‌లో వరుసగా 6, 4, 4, 6 బాదేసిన హార్దిక్ పాండ్య.. మరో 6 బంతులు మిగిలి ఉండగానే ముంబయికి విజయాన్ని అందించాడు. దీంతో.. ఇప్పుడు కోహ్లీ, ఆశిష్ నెహ్రాపై బెంగళూరు అభిమానులు మండిపడుతున్నారు. పవన్‌ నేగితో 19వ ఓవర్‌లో బౌలింగ్ చేయించడంపై విరాట్ కోహ్లి మాట్లాడుతూ ‘అప్పటికి క్రీజులో హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్ రూపంలో ఇద్దరూ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌లు ఉండటంతో.. ఎడమ చేతి వాటం స్పిన్నర్‌గా ఉన్న పవన్ నేగితో బౌలింగ్ చేయించాం. కొద్దిగా మంచు పడుతుండటంతో రిస్క్ తీసుకోక తప్పలేదు. కానీ.. ఫలితం మాకు అనుకూలంగా రాలేదు’ అని కోహ్లీ వెల్లడించాడు. వాస్తవానికి ఫాస్ట్ బౌలర్ నవదీప్ షైనీ‌తో 19వ ఓవర్ వేయిస్తారని అంతా అనుకున్నారు. కానీ.. అప్పటికి 3 ఓవర్లు వేసిన షైనీ 34 పరుగులిచ్చినా.. 140-145 కిమీ వేగంతో బంతులు సంధిస్తూ వచ్చాడు. ఒకవేళ అతను కాకపోయినా.. సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్‌తోనైనా బౌలింగ్ చేయిస్తాడేమో..? అని అనుకున్నారు. కానీ.. ఇద్దరితో కాకుండా.. నెహ్రా సూచన మేరకు స్పిన్నర్‌తో బౌలింగ్ చేయించగా.. హార్దిక్ పాండ్యా చెలరేగిపోయి.. తన పవర్ హిట్టింగ్‌తో మ్యాచ్‌ను ముంబయికి ఎగరేసుకుపోయాడు.