130 స్థానాలకు పైగా టీడీపీదే

SMTV Desk 2019-04-16 17:45:40  tdp, ycp,

ఏపీలో మొన్న జరిగిన ఎన్నికలలో ప్రజలందరూ ఏకపక్షాన తీర్పునిచ్చారని, ప్రతి ఒక్కరూ టీడీపీ అభివృద్ధి, సంక్షేమాలను దృష్టిలో పెట్టుకుని ఓటు వేశారని, ఫలితాలు ఇంకా వెలువడకముందే గెలుపెవరిదో తేలిపోయిందంటూ, పక్కాగా 130కి పైగా అసెంబ్లీ స్థానాలలో టీడీపీ విజయబావుట ఎగురవేస్తుందని మళ్లీ మరొక్కసారి టీడీపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పీకర్ కోడెల శివప్రసాదరావు ధీమా వ్యక్తం చేశారు.

అయితే పోలింగ్ సమయంలో ఎక్కడ చూసినా ఈసీ వైఫల్యాలే కనిపించాయని, విచ్చలవిడిగా వైసీపీ డబ్బులు పంచుతున్నా చూస్తూ ఉండిపోయిందని, పై నుంచి తమకు వచ్చిన ఆదేశాల ప్రకారం ఉద్దేశపూర్వకంగానే భద్రతను పూర్తి స్థాయిలో మోహరించకుండా, అల్లర్లకు తెరలేపారని అయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా చాల చోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడం, పలుచోట్ల మధ్యాహ్నం వరకు పోలింగ్ ప్రారంభం కాకపోవడం దారుణమని చెప్పారు. అయితే మరి కొన్ని చోట్ల అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పోలింగ్ జరిగిందంటే ఈసీ తప్పిదాలు ఎలాంటివో చెప్పనక్కర్లేదు అని అన్నారు. గతంలో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదని దీనిపై వెంటనే ఈసీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలపై ప్రిసైడింగ్ ఆఫీసర్లు, పోలింగ్ ఆఫీసర్లకు కనీస అవగాహన కూడా కల్పించకుండా ఎన్నికలకు ఎల సిద్దం చేశారని, ఈవీఎంలు పని చేయకపోతే అప్పటికప్పుడు ప్రాథమికంగా రిపేరు చేసేలా అవగాహన కల్పించలేదని ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండుంటే ఓటింగ్ శాతం మరింత పెరిగి ఉండేదని అన్నారు.