మేమేదో భయపడుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు!!!

SMTV Desk 2019-04-16 17:40:59  budda venkanna, tdp mlc, ap elections, election commission, chandrababu

విజయవాడ: ఏపీ ఎన్నికల సమయంలో అనేక దాడులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడులను ఎన్నికల సంఘం సమర్ధించడం విడ్డూరంగా ఉందని టిడిపి ఎమ్యెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....ఏపిలో ఎన్నికలు సజావుగా జరగడానికి కేంద్రం ప్రత్యేక భద్రత దళాలను ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి ఈసిని కలిసి చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఇక్కడ జరిగిన అన్యాయం మరెక్కడా జరగకూడదనే ఉద్ధేశ్యంతో చంద్రబాబు ఈసిని కలిశారు. దానికి తామేదో భయపడ్డామని విషప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్న విజయసాయికి, ఓక్స్‌ వాగన్‌ కేసులో పేరున్న బొత్సకు ఈసి అపాయింట్‌మెంట్‌ ఇస్తుందా? అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. ఏదెలా ఉన్నా ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం సునామి సృష్టిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.