ప్రపంచంలోనే తొలి ఉభయచర డ్రోన్ బోట్‌ను ప్రారంభించిన చైనా

SMTV Desk 2019-04-16 17:39:28  first armed amphibious drone boat, china,

బీజింగ్: సాంకేతిక రంగంలో ఎప్పుడూ ముందంజలో దూసుకెళ్ళే చైనా తాజాగా తన ఆర్మీకి నూతన ఆయుధాలను తీర్చిదిద్దే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో చైనా ప్రపంచంలోనే మొట్టమొదటి ఉభయచర డ్రోన్ బోట్‌ను ప్రారంభించింది. ఇది సముద్ర గర్భంలోనూ, గగనతలంలోనూ మెరుపుదాడులకు దిగగల్గుతుందని, శత్రువుల దాడులను అన్ని స్థాయిలలో తిప్పికొడుతుందని చైనా సైనిక విశ్లేషకులు సోమవారం తెలిపారు. ఇది అటు డ్రోన్‌గా, ఇటు యుద్ధ నౌకగా కూడా రెండంచెల యుద్ధ పోరాట వ్యవస్థలను సంతరించుకుని శక్తివంతంగా ఉందని చైనా అధికారికంగా వెల్లడించింది. గగనతలంలోని డ్రోన్‌లను, సముద్రగర్భంలోని డ్రోన్ షిప్‌లను కూడా ఇది దెబ్బతీస్తుందని వివరించారు. వుచ్‌హాంగ్ షిప్‌బిల్డింగ్ ఇండీస్ట్రీ గ్రూప్ వారు చైనా నౌకానిర్మాణ పారిశ్రామిక సంస్థతో కలిసి సంయుక్తంగా ఈ టూ ఇన్ వన్ డ్రోన్‌ను రూపొందించారు. డ్రాగన్ రూపొందించిన ఈ డ్రోన్‌కు మెరైన్ లిజర్డ్ అని పేరు పెట్టారు. దీనికి జరిపిన అన్ని పరీక్షలు విజయవంతం అయినట్లు, అన్ని విధాలుగా ఇది నిర్ధేశిత అంచనాలతో లక్షాలను ఛేదించిందని, తయారు అయిన ఫ్యాక్టరీ నుంచి దీనిని క్షేత్రస్థలికి తరలించారని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ సోమవారం తెలిపింది. నౌకా రూపంలో ఈ లిజర్డ్ 12 మీటర్ల పొడువు ఉంటుంది. ఇది 50 నాట్ల గరిష్ట వేగంతో దూసుకువెళ్లుతుంది. దీనిపై డీజిల్‌తో పనిచేసే హైడ్రోజెట్ అమరి ఉంటుంది. ఇక దీని అట్టడుగు భాగంలో ఉండే నాలుగు ట్రక్కుల సముదాయాలు భూ ఉపరితలంపైకి చేరగానే ఈ షిప్ నుంచి విడిపోతాయి. ఈ ట్రక్కుల సముదాయం గంటకు 20 కిలోమీటర్ల వేగంతో భూమిపై దూసుకువెళ్లుతాయి. ఈ వేగాన్ని ఆ తరువాతి దశలో పెంచుతారని అధికారులు చెప్పినట్లు గ్లోబల్ టైమ్స్ తెలిపింది. 179 బిలియన్ డాలర్ల రక్షణ బడ్జెట్‌తో, 20 లక్షల మంది సైనిక పటిష్ట బలగంతో ఉన్న చైనా సైనిక దళం ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక శక్తిగా ఉంది. ఇప్పుడు ఈ డ్రోన్ కమ్ బోట్ అదనపు శక్తిగా మారుతోంది.