టీడీపీపై వైసీపీ నేతలు ఫిర్యాదు

SMTV Desk 2019-04-16 17:00:58  tdp, ycp,

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిశాక నాయకులు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. కౌంటింగ్‌ జరిగేంత వరకు అభ్యర్థులు, అనుచరులు, అభిమానులు ఎవరి లెక్కల్లో వారు మునిగితేలుతారు. కానీ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ పోలింగ్‌ ముగిశాక భిన్నమైన పరిస్థితి నెలకొంది. అధికార తెలుగుదేశం, విపక్ష వైసీపీలు ఒకరిపై ఒకరు పోటీ పడి ఫిర్యాదు చేసుకుంటున్నారు. పోలింగ్‌కు ఒకరోజు ముందు నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసీపై ధ్వజమెత్తడం మొదలెట్టి ఢిల్లీ వరకు తన ఫిర్యాదులు కొనసాగిస్తే తాజాగా వైసీపీ కూడా అదే మార్గాన్ని ఎంచుకోవడం గమనార్హం. ఎన్నికల సంఘాన్ని కలిసి టీడీపీ నేతల తీరును వివరించాలని నిర్ణయించారు. ఎన్నికల అనంతరం వైసీపీ నాయకులపై జరుగుతున్న దాడులను వారి దృష్టికి తీసుకువెళ్లారు.

దీంతో మేమేం తక్కువ తిన్నామా అంటూ వైసీపీ కూడా నిన్న ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)ను కలిసింది. ఏపీలో టీడీపీ వ్యవహరిస్తున్న తీరు, ప్రభుత్వం చేస్తున్న కొత్త అప్పులు, ఈసీ నియమావళిని ఉల్లంఘిస్తున్న టీడీపీపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఏపీలో ఈవీఎంలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని సీఈసీని కోరినట్టు తెలుస్తోంది. సీఈసీని కలిసిన ఈ బృందంలో విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, వేమిరెడ్డి, బాలశౌరి, సి.రామచంద్రయ్య, అవంతి, బుట్టా రేణుక తదితరులు ఉన్నారు. ఏపీలో వైసీపీ కార్యకర్తలు లక్ష్యంగా టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయని అందుకే స్ట్రాంగ్‌ రూంలలో ఉన్న ఈవీఎంలకు భద్రత పెంచడంపై దృష్టి సారించాలని ఈసీని కోరారు.