అప్పుడు ఇవిఎంలతో గెలలేదా?...కెటిఆర్

SMTV Desk 2019-04-16 14:29:07  trs, ktr, ap cm, chandrababu, tdp, evm machines, election commission

హైదరాబాద్: టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆదివారం మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ 100 శాతం ఫలితాలను సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మే 20వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కావాలని సిఎం కెసిఆర్ కోరుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. త్వరలో కొత్త మున్సిపల్ చట్టం రానుందని, వచ్చే రెండు నెలల్లో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని అలాగే తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, ఎపిలో మాత్రం ఘర్షణల మధ్య ఎన్నికలు జరిగాయని ఆయన తెలిపారు. ఇకపోతే తెలంగాణలో ఎన్నికలు జరిగిన తీరు టిఆర్‌ఎస్ పాలనకు అద్దం పడుతోందన్నారు. ఎపి సిఎం చంద్రబాబునాయుడు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, ఎపిలో ఇసి అధికారులను బదిలీ చేస్తే చంద్రబాబు భయపడుతున్నారని, చంద్రబాబు పనై పోయిందని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఇవిఎంలను తప్పుబడుతున్న చంద్రబాబు 2014 ఎన్నికల్లో ఇవిఎంలతో గెలవలేదా అని కెటిఆర్ ప్రశ్నించారు. ఒకటి రెండు పథకాలతో ఓట్లు పడవని, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పని చేసినప్పుడే ప్రజలు ఆదరిస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో కాంగ్రెస్ డిపాజిట్ కూడా గల్లంతవుతుందని పేర్కొన్నారు. మరో ఐదింటిలో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంటుందని జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజలు బిజెపిని ఆదరించరని ఆయన తేల్చి చెప్పారు. తాము అందిస్తున్న పారదర్శక పాలనను ప్రజలతో పాటు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు స్వాగతిస్తాయన్న నమ్మకం తమకు ఉందని ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలో మెజార్టీ ఉద్యోగులు మంచివారేనని, కొంతమంది ఉద్యోగుల వల్లనే సమస్యలు వస్తున్నాయని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా నాడు ఎపి మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఎబి వెంకటేశ్వరరావు ఏం చేశారో ప్రజలకు తెలిసిందేనని కెటిఆర్ వెల్లడించారు. ఒక తెలుగు దినపత్రికలో ఆయన జాహ్నవి పేరుతో తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా కథనాలు రాశారని పేర్కొన్నారు. అటువంటి అధికారులను ఇసి బదిలీ చేస్తే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని కెటిఆర్ ప్రశ్నించారు.