కాశ్మీర్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయగీతానికి అగౌరవం

SMTV Desk 2017-08-16 18:53:14  Kashmir, Jammu, 71st Independence day celebrations, National anthem insulting

కాశ్మీర్, ఆగస్ట్ 16: దేశవ్యాప్తంగా 71వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు ఆకాశాన్ని అంటాయి. అయితే కాశ్మీర్‌లోని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చూసి, అక్కడికి మొద‌టి సారి వేడుక‌ల డ్యూటీకి వెళ్లిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పోలీసులు ఆశ్చర్యానికి లోనయ్యారు. వివరాల్లోకి వెళ్తే జ‌మ్మూ కాశ్మీర్‌ ప్రభుత్వం శ్రీనగర్లోని భ‌క్షి స్టేడియంలో అధికారికంగా స్వాతంత్ర్య వేడుక‌లు నిర్వహించింది. కాగా, ఈ స్టేడియంలో 18,000 మంది కూర్చోగ‌ల సామ‌ర్థ్యం ఉన్న స్వాతంత్ర్య దినోత్స‌వ కార్య‌క్ర‌మానికి కేవ‌లం 3000 మంది హాజ‌రయ్యారు. అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుక‌ల్లో జాతీయ గీతాన్ని ప్ర‌జ‌లు అగౌర‌వ‌ప‌రిచారు. ముఖ్య‌మంత్రి మెహ‌బూబా ముఫ్తీ జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం, జాతీయ గీతం పాడుతున్నప్పుడు సాధార‌ణ గ్యాల‌రీల్లో కూర్చున్న చాలా మంది కూర్చునే ఉన్నారు. ప్రముఖుల కుర్చీలలో కూర్చున్న హైకోర్టు న్యాయ‌మూర్తులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇత‌ర అధికారులు నిల్చుని త‌మ దేశ‌భ‌క్తిని చాటుకున్నారు. దీనిపై యూపీ పోలీసులు స్పందిస్తూ మా రాష్ట్రంలో స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుకలు పండ‌గ‌లా జ‌రుపుకుంటార‌ని, కాశ్మీర్లో ప‌రిస్థితి త‌మ‌కు ఒకింత‌ ఆశ్చ‌ర్యం, ఒకింత బాధ క‌లిగించాయ‌ని చెప్పారు.