ఓటు వేయని గ్రామం

SMTV Desk 2019-04-12 19:21:26  parliament elections, trs, elections, voting, mahabub nagar, narayanapeta district voters, thileru village

మహబూబ్ నగర్: రాష్ట్రంలో గురువారం నిర్వహించిన పార్లిమెంట్ ఎన్నికల్లో నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు గ్రామస్థులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. రెండు రోజుల క్రితం ఈ గ్రామానికి చెందిన మహిళలు కూలి పనికి వెళ్లి మట్టి పెల్లలు విరిగిపడడంతో 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. సరిగ్గా పోలింగ్‌కు ముందు రోజు ఈ సంఘటన చోటు చేసుకోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. మృతులంతా ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో ఆ ఊరి గ్రామస్థులు ఓటేసేందుకు నిరాసక్తత చూపించారు. దీంతో గ్రామమంతా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. గ్రామస్థులు ఎవరూ ఓటేసేందుకు ముందుకు రాకపోవడంతో పోలింగ్ అధికారులు అలాగే ఉండిపోయారు. కొందరు అధికారులు గ్రామస్తులు నచ్చ జెప్పే ప్రయత్నం చేసినప్పటికీ గ్రామస్థులు ససేమిరా ఒప్పుకోలేదు. మొత్తం 2456 మంది ఓటర్లు ఉండగా ఏడుగురు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమకు నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్నారు. అయితే నారాయణపేట ఆర్‌డిఓ తక్షణ సహాయంగా గురువారం ఉదయం వచ్చి బాధిత కుటుంబాలకు రూ. 50 వేలు ఆర్థ్ధిక సహాయం చెక్కులు ఇచ్చి వెళ్లారు.