విజయాలతో దూసుకెళ్తున్న చెన్నై...

SMTV Desk 2019-04-12 18:01:06  rr vs csk, ipl 2019, mahendra singh dhoni

ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా గురువారం రాజస్థాన్ రాయల్స్‌తో జైపూర్ వేదికగా తీవ్ర ఉత్కంఠ, వివాదాల నడుమ ముగిసిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన మహేంద్రసింగ్ ధోనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అలాగే ఐపీఎల్ సీజన్లో కెప్టెన్ గా 100 మ్యాచ్ లు గెలిచిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తాజా సీజన్‌లో ఇప్పటికే ఏడు మ్యాచ్‌లాడిన చెన్నై జట్టు ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆరు మ్యాచ్‌లాడి కేవలం ఒక్క విజయాన్ని మాత్రమే అందుకున్న రాజస్థాన్ జట్టు పట్టికలో ఏడో స్థానంలో ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు సమష్టిగా రాణించి 151 పరుగులు చేసింది. ఓపెనర్లు అజింక్య రహానె (14: 11 బంతుల్లో 3x4), జోస్ బట్లర్ (23: 10 బంతుల్లో 4x4, 1x6) తొలి వికెట్‌కి 31 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా.. అనంతరం వచ్చిన స్టీవ్‌స్మిత్ (15: 22 బంతుల్లో 1x4), బెన్‌స్టోక్స్ (28: 26 బంతుల్లో 1x4), శ్రేయాస్ గోపాల్ (19 నాటౌట్: 7 బంతుల్లో 2x4, 1x6) నిలకడగా ఆడటంతో.. రాజస్థాన్ 7 వికెట్ల నష్టానికి గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. చెన్నై జట్టులో దీపక్ చాహర్, శార్ధూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు పడగొట్టగా.. మిచెల్ శాంట్నర్ ఒక వికెట్ తీశాడు. ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్‌కి మెరుగైన ఆరంభం లభించలేదు. ఓపెనర్ షేన్ వాట్సన్ (0),సురేశ్ రైనా (4), డుప్లెసిస్ (7) ,కేదార్ జాదవ్ (1) వరుసగా వికెట్లు చేజార్చుకోవడంతో ఒకానొక దశలో 24/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ.. బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, అంబటి రాయుడు (57: 47 బంతుల్లో 2x4, 3x6) జోడీ.. చెన్నై టీమ్‌ని ఆదుకుంది. క్రీజులో కుదురుకునే వరకూ నెమ్మదిగా ఆడిన ఈ జోడీ ఐదో వికెట్‌కి అభేద్యంగా 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి చెన్నై జట్టుని విజయతీరాలకి చేర్చింది. అయితే.. జట్టు స్కోరు 119 వద్ద రాయుడు ఔటవగా.. అనంతరం జడేజాతో కలిసి దూకుడు పెంచిన ధోనీ.. 144 వద్ద ఆఖరి ఓవర్‌లో ఔటయ్యాడు. కానీ.. చివర్లో మిచెల్ శాంట్నర్, రవీంద్ర జడేజా జోడీ.. మంచి సమన్వయంతో ఆఖరి బంతికి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేసింది.