ఓటు కోసం తప్పవీ పాట్లు!!

SMTV Desk 2019-04-11 11:59:21  telangana, ap, voting, elections

హైదరాబాద్‌: పార్లిమెంట్ ఎన్నికల సదర్భంగా హైదరాబాద్ నుండి తమ సొంత గ్రామాలకు వెళ్లి ఓటు వినియోగించుకునేందుకు ప్రజలు మెల్లగా కదులుతున్నారు. దీంతో లింగంపల్లి, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, కాచిగూడ స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి పండగ రోజులను తలపించే విధంగా ప్రయాణాలు సాగుతున్నాయి. సికింద్రాబాద్‌ స్టేషన్లో సాయంత్రం బయలుదేరే ఫలక్‌నుమా, విశాఖ ఎక్స్‌ప్రెస్‌, గోదావరి ఎక్స్‌ప్రెస్‌లలో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. అలాగే తెలంగాణలోని జిల్లాలో ఉండే ప్రజలు కూడా విపరీత కష్టంతో గమ్యాన్ని చేరుకుంటున్నారు. కొన్ని ప్రైవేటు ట్రావెల్‌ సంస్థలురూ. 500 నుంచి రూ. 600 వరకూ ఉండే టికెట్‌ను రెట్టింపు చేశాయి. అలాగే విశాఖపట్నం వైపు వెళ్లే టికెట్లను రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకూ అమ్ముకున్నాయి. ఇదే పరిస్థితి ఏలూరు, రాజమహేంద్రవరం, కాకినాడ, తిరుపతి, కర్నూలు, అనంతపురం ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లోనూ ఉంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఏపీఎస్‌ఆర్టీసీ రోజూ నడిపే 540 బస్సులకు అదనంగా 300 బస్సులను వేసింది. 10వ తేదీన కూడా ప్రత్యేక బస్సులను నడుపుతామని ఏపీఎస్‌ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం సుధాకర్‌ చెప్పారు. 500 బస్సులు అదనంగా నడుపుతున్నామని టీఎస్‌ఆర్టీసీ రంగారెడ్డి ఆర్‌ఎం యాదగిరి తెలిపారు.