ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త

SMTV Desk 2019-04-10 15:51:39  sbi, state bank of india, government

ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు శుభవార్త తెలిపింది. బ్యాంక్ నుంచి రుణాలు తీసుకున్న వారిపై వడ్డీ భారం తగ్గించి రుణ రేట్లలో కోత విధించింది. ఎంసీఎల్ఆర్ రేటును 5 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. రుణ రేట్ల తగ్గింపు ఏప్రిల్ 10 నుంచి అమలులోకి వస్తుందని బ్యాంక్ తెలిపింది. ఏడాది కాలపు రుణాలపై సవరించిన ఎంసీఎల్ఆర్ రేటు 8.50 శాతంగా ఉంది. ఇది ఇంతకు ముందు 8.55 శాతం. బ్యాంక్ అలాగే గృహ రుణాలపై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లమేర తగ్గించింది. రూ.30 లక్షల వరకు ఉన్నా రుణాలకే ఇది వర్తిస్తుంది. దీంతో రూ.30 లక్షలలోపు ఉన్న గృహ రుణాలపై వడ్డీ రేటు శ్రేణి 8.70-9 శాతం నుంచి 8.60-8.90 శాతానికి దిగొచ్చింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఏప్రిల్ 4న రెపో రేటు పావు శాతం తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో రెపో రేటు 6 శాతానికి దిగొచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా ఎంసీఎల్ఆర్ రేటు తగ్గించింది. ఇప్పుడు ఎస్‌బీఐ కూడా హెచ్‌డీఎఫ్‌సీ దారిలోనే వెళ్లింది.