రహస్య పత్రాల ఆధారంగా విచారణకు ఓకే: సుప్రీమ్ కోర్టు

SMTV Desk 2019-04-10 15:43:56  rafale deal, supreme court, modi government, anil ambani

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: రాఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు అంశంలో మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రహస్య డాక్యుమెంట్ల ఆధారంగా తీర్పును సమీక్షించేందుకు సుప్రీం అంగీకరించింది. రాఫేల్‌ కొనుగోలుపై మోదీ ప్రభుత్వ అభ్యంతరాలను చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వ్యతిరేకించింది.

రక్షణశాఖ నుంచి చోరీ చేసిన డాక్యుమెంట్లపై కేసును సమీక్షించరాదు అంటూ సుప్రీంను కేంద్రం కోరింది. కానీ ఆ అభ్యంతరాలను చీఫ్‌ జస్టిస్‌ తిరస్కరించారు. దీంతో రాఫేల్‌ కొనుగోలుపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా రహస్య పత్రాలపై సుప్రీం విచారణ చేపట్టనున్నది. వాస్తవానికి గత ఏడాది డిసెంబర్‌లో ఇచ్చిన తీర్పులో.. రాఫేల్‌ కొనుగోలులో ఎటువంటి అవకతవకలు జరగలేదని సుప్రీం వెల్లడించింది. అయితే ఇవాళ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఒకరకంగా పత్రికా స్వేచ్ఛకు విక్టరీగా భావిస్తున్నారు.

రాఫేల్‌ కొనుగోలు కోసం మోదీ ప్రభుత్వ కార్యాలయం ఫ్రెంచ్‌ కంపెనీతో సమాంతర చర్చలు నిర్వహించినట్లు ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక తన అనేక కథనాల్లో వివరించింది. అయితే ఆ రహస్య పత్రాల వల్ల జాతీయ భద్రతకు ముప్పు ఉందని కేంద్రం కోర్టు ముందు వాదించింది. దాన్ని కోర్టు తిరస్కరించింది. 36 రాఫేల్‌ యుద్ధ విమానాలను భారత్‌ ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఆ విమానాల తయారీ కోసం అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ సంస్థకు అక్రమ పద్ధతిలో కాంట్రాక్టు ఇచ్చినట్లు తెలుస్తోంది. కొత్త డాక్యుమెంట్ల ఆధారంగానే తీర్పును సమీక్షిస్తామని సుప్రీం చెప్పింది. ఇవాళ తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో రంజన గగోయ్‌తో పాటు జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, కేఎం జోసెఫ్‌లు ఉనానరు. రాఫేల్‌ ధరపై రివ్యూ పిటీషన్‌ అంగీకరించినా, అయితే ఎప్పుడు దానిపై విచారణ చేపట్టాలన్న అంశంపై త్వరలోనే తేదీలను వెల్లడించనున్నట్లు కోర్టు తెలిపింది.