యువనేత కన్నయ్య కోసం బరిలోకి దిగిన బాలీవుడ్ నటి

SMTV Desk 2019-04-10 11:01:06  bollywood actress, swara bhasker, bihar, cpi candidate, kannayaa

బీహార్, ఏప్రిల్ 10: తన స్నేహితుడు, ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో బెగూసరాయ్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన యువనేత కన్నయ్య కుమార్ గెలుపుకోసం ఆయన స్నేహితురాలు, బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ రంగంలోకి దిగింది. వామపక్షాల తరఫున కన్నయ్య కుమార్ బరిలోకి దిగగా, 31వ పుట్టినరోజును జరుపుకుంటున్న స్వరా భాస్కర్, ఆయన తరఫున ప్రచారం చేస్తున్నారు.

తన బర్త్ డే వేడుకలకు బదులుగా కన్నయ్య కోసం వీధుల్లోకి వచ్చిన ఆమె, "సాధారణంగా పుట్టినరోజును ఇలా ఎవరూ జరుపుకోరు. కన్నయ్య నాకు ఎంతో మంచి స్నేహితుడు. ఆయన మనందరి తరపునా ఎంతో ముఖ్యమైన యుద్ధం చేస్తున్నారు. ఆయన గెలిస్తే, అది భారత ప్రజాస్వామ్యానికే విజయం అవుతుంది" అని వ్యాఖ్యానించింది.

తాను ఇంతవరకూ ఏ రాజకీయ పార్టీకీ ప్రచారం చేసింది లేదని, అందువల్ల ఈ ప్రచారాన్ని ఎలా సాగించాలో తెలియడం లేదని అంది. కాగా, గత నెలలో బెగూసరాయ్ నుంచి కన్నయ్య పేరును ప్రకటించిన తరువాత కూడా స్వరా భాస్కర్ హర్షం వ్యక్తం చేస్తూ, తన మద్దతును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక జేఎన్యూ విద్యార్థి నేతగా ఉన్న కన్నయ్య, గతంలో ఎన్నోమార్లు ఉద్యమాలు చేసి, జాతీయ మీడియా వార్తల్లో నిలవడంతో పాటు దేశద్రోహ కేసును ఎదుర్కొని జైలుకు కూడా వెళ్లి వచ్చారన్న సంగతి తెలిసిందే.