మోడీ వేడి తగ్గింది...150 సీట్ల కంటే ఎక్కువ రావు

SMTV Desk 2019-04-10 10:39:13  trs, ktr, bjp, congress, narendramodi, nalgonda, trs mp vemi narasimhareddy

నల్లగొండ: గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలను ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు మట్టి కరిపించారని, అదే చైతన్యంతో లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నల్లగొండ టిఆర్ఎస్ ఎంపి వేమిరెడ్డి నరసింహారెడ్డికి మద్ధతుగా రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కెటిఆర్ పాల్గొని మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో, ఆ తరువాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపిలను చావుదెబ్బ కొట్టాలని కెటిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్, బిజెపిలను గెలిపించడం వల్ల ఎటువంటి లాభం లేదని, టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే తెలంగాణ హక్కులు, నిధులు సాధించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. తన ఐదేళ్ల పాలనలో తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ చేసిందేమీ లేదని ఆయన ధ్వజమెత్తారు. మోడీ వేడి తగ్గిందని, ఆయన పార్టీకి 150 సీట్ల కంటే ఎక్కువ రావని, కాంగ్రెస్ కు వంద సీట్లు కూడా రావాని కెటిఆర్ జోస్యం చెప్పారు. 16 మంది టిఆర్‌ఎస్ ఎంపిలు గెలిస్తే ఢిల్లీ జుట్టు మన చేతుల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇద్దరు ఎంపిలతో తెలంగాణ తెచ్చిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. బిజెపియేతర, కాంగ్రేసేతర పార్టీలే కేంద్రంలో అధికారంలోకి రానున్నాయని ఆయన తేల్చి చెప్పారు. కాంగ్రెస్ బిజెపి ఎంపిలు ఢిల్లీ దర్బారులో గులాములుగా ఉంటారని, వారి వల్ల తెలంగాణకు ఎటువంటి ప్రయోజనం లేదని, ఈ క్రమంలోనే టిఆర్ఎస్ ను 16 స్థానాల్లో గెలిపిస్తే, ఢిల్లీలో చక్రం తిప్పి తెలంగాణకు నిధులు, మన హక్కులు సాధించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.