యాదాద్రికి జగన్ చెప్పులు వేసుకుని వస్తే కేసీఆర్ గారు ఒప్పుకుంటారా?

SMTV Desk 2019-04-09 18:17:33  pawan kalyan, kcr, trs, jagan mohan reddy, janasena

అమరావతి, ఏప్రిల్ 09: ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి అన్ని కులాలు, మతాలు, సంస్కృతులను గౌరవించాలని, చెప్పులతో కొండెక్కి తిరుమలను అపవిత్రం చేసిన జగన్మోహన్ రెడ్డిలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు.

తెలంగాణలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన యాదాద్రికి జగన్ చెప్పులు వేసుకుని వస్తే కేసీఆర్ గారు ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు. తెలంగాణ పోరాటంలో నిజాయతీ ఉందని, కేసీఆర్ గెలవడం, ముఖ్యమంత్రి కావడం ధర్మం అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ అండగా ఉండటం అధర్మం అని, దీనిని యాదాద్రి నర్సింహస్వామి, చండిదేవీ కూడా ఒప్పుకోరని వ్యాఖ్యానించారు.

ఆంధ్రులను పచ్చిబూతులు తిట్టిన కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అంటే ఆంధ్రులు ఓట్లు వేసేస్తారా? అని అన్నారు. 2014లో జగన్ బంపర్ మెజార్టీతో గెలవబోతున్నారని కేసీఆర్ చెప్పారని, అప్పుడు ఏమైందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని కోరారు. అప్పటికీ, ఇప్పటికీ వైసీపీ ఏ మాత్రం బలపడలేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ కాదని, జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించబోతుందని జోస్యం చెప్పారు.

జనసేన పార్టీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయ‌న‌, భీమవరం నుంచి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఓ వీడియో సందేశాన్ని పంపారు. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ‘తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీకి చెందిన కొంత మంది నాయకులు నా సంస్కారాన్ని బలహీనత అనుకుంటున్నారు. నన్ను ద్వేషించే శత్రువు ఇంటికి వచ్చినా ఆతిధ్యం ఇచ్చి పంపిస్తాను’ అని అన్నారు.