పార్టీని వీడను అని బాండ్ పేపర్ మీద సంతకం చేసిన పొన్నం ప్రభాకర్

SMTV Desk 2019-04-09 15:39:00  ponnam prabhakar, congress party, karimnagar

కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఆయన తనపై మారుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు. ఈ నేపథ్యంలో ఆయన బాండ్ పేపర్ మీద సంతకం చేసి తాను రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీని వీడనని పేర్కొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పొన్న ప్రభాకర్.. సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని బాండ్ పేపర్ ద్వారా అఫిడవిట్‌ను విడుదల చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా గులాబీ గూటికి చేరుతున్నారని, ఈ నేపథ్యంలో తాను కూడా పార్టీని వీడుతున్నట్లు వార్తలు వస్తున్నాయని, తాను పార్టీ మారడం లేదనడానికి సాక్ష్యంగా అఫిడవిట్ ఇస్తున్నట్లు తెలిపారు. ‘నేను పార్టీ మారితే. నాపై చట్టరీత్యా చర్యలు తీసుకునే హక్కు ప్రజలకు ఉంటుంది. ఈ బాండ్ పేపర్ తో నాపై చీటింగ్, క్రిమినల్ కేసు కూడా పెట్టుకోవచ్చు. ఈ పత్రాలను లోక్ సత్తాతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలకు ప్రజా సంఘాలకు పంపిచాను’ అని పొన్నం పేర్కొన్నారు.