ప్రభుత్వ పోటీ పరీక్షలకు ఫీజు రద్దు!!!

SMTV Desk 2019-04-09 15:35:41  rahul gandhi, congress party, loksabha elections, government competitive exams fee

న్యూఢిల్లీ: జాతీయ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జరిగే పోటీ పరీక్షలకు దరఖాస్తు ఫీజుని రద్దు చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. అలాగే ఆరోగ్య పరిరక్షణ హక్కు చట్టాన్ని కూడా తీసుకొని వస్తామని తెలిపారు. దీనివల్ల ప్రజలకు ఆరోగ్య పరిరక్షణ సేవలకు పూచీకత్తు లభిస్తుందని పేర్కొన్నారు. ఆరోగ్య రంగంపై ప్రభుత్వ వ్యయాన్ని జీడీపీలో 3 శాతానికి పెంచుతామని తెలిపారు. మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన ఇతర హామీలను కూడా ప్రజల్లోకి ఉద్ధృతంగా తీసుకెళతామని పేర్కొన్నారు. తమ ప్రచార వీడియోను షేర్‌ చేయాలంటూ ప్రజలను ట్విటర్‌లో కోరారు. కేరళలోని వాయనాడ్ లోక్ సభ స్థానానికి నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ.. బుధవారం రోజున ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ లోక్‌సభ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ ఆయన వెంట ఉంటారని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. తరువాత గౌరీగంజ్‌ రోడ్‌షోలో రాహుల్ గాంధీ పాల్గొంటారు.