రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే: కారు జోరు కాంగ్రెస్ బేజారు

SMTV Desk 2019-04-09 15:29:12  telangana poll survey, telangana cm kcr, republic tv-c voter survey

హైదరాబాద్, ఏప్రిల్ 09: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు కొనసాగనుందని రిపబ్లిక్ టీవీ-సీ ఓటర్ సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కదని ఈ సర్వే నివేదికలు చెబుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో 16 ఎంపీ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకొంటుందని ఈ సంస్థ ప్రకటించింది. టీఆర్ఎస్ మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం కూడా హైదరాబాద్ స్థానంలో జయకేతనం ఎగురవేయనున్నట్టు ఆ సంస్థ తేల్చి చెప్పింది.

గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. 88 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచింది. అదే రీతిలో ఎంపీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ఘన విజయం సాధించనున్నట్టు ఈ సంస్థ అభిప్రాయపడింది. 42.8 శాతం ఓట్లతో టీఆర్ఎస్ 16 ఎంపీ స్థానాలను గెలుచుకొనే అవకాశం ఉందని ఆ సంస్థ ప్రకటించింది.

తెలంగాణలోని 16 ఎంపీ స్థానాలకు దక్కించుకొనే వ్యూహంతో కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సర్వేలో కూడా కేసీఆర్ అంచనాలకు తగ్గట్టుగానే ఉంది. టీఆర్ఎస్‌కు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం‌కు 3 శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వే సంస్థ తేల్చి చెప్పింది. హైదరాబాద్ ఎంపీ స్థానంలో ఎంఐఎం అభ్యర్ధి అసదుద్దీన్ ఓవైసీ గెలుపు నల్లేరుపై నడకేనని ఈ సర్వే తేల్చింది.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 33.4 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని సీ ఓటర్ సర్వే ప్రకటించింది. అయితే ఒక్క ఎంపీ స్థానం కూడా ఆ పార్టీకి దక్కదని తేల్చి చెప్పింది. కొన్ని కీలకమైన ఎంపీ స్థానాల్లో తమ అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు ఆశతో ఉన్నారు. కానీ ఈ సర్వే ఫలితాలు మాత్రం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి.

బీజేపీకి 14.7 శాతం ఓట్లు దక్కనున్నాయి. కానీ ఒక్క ఎంపీ సీటు కూడా బీజేపీకి రాదని ఈ సర్వే తేల్చి చెప్పింది. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కారణంగా సికింద్రాబాద్ ఎంపీ స్థానంతో పాటు 5 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది.

తెలంగాణలో పోటీలో ఉన్న జనసేన సహా ఇతర పార్టీలకు ఒక్క సీటు కూడా రాదని ఈ సర్వే స్పష్టం చేసింది. కానీ, ఇతరులకు 6.2 శాతం ఓట్లు దక్కనున్నాయని ఆ సంస్థ తన సర్వే రిపోర్టులో పేర్కొంది.