ఆ మేనిఫెస్టో ఓ అబద్ధాల పుట్ట!!

SMTV Desk 2019-04-09 13:09:51  Prime Minister Narendra Modi, Congress, Randeep Singh Surjewala

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ప్రధాని నరేంద్రమోదీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా బిజెపి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విడుదల చేసిన మేనిఫెస్టో పై ఆయన స్పందిస్తూ...మేనిఫెస్టో ఓ ‘‘అబద్ధాల పుట్ట’ ప్రధానమంత్రి నరేంద్రమోదీని దేశ ప్రజలు ఇకపై నమ్మబోరని అని అన్నారు. అలాగే ‘‘గత ఏదేళ్లలో దేశానికి ఏమీ చేయనందున బీజేపీకి రిపోర్టు కార్డులో ఒక్క మార్కుకూడా వెయ్యను…’’ అంటూ బీజేపీ మాజీ నేత మురళీ మనోహర్ జోషి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా సుర్జేవాలా ప్రస్తావించారు. రైతుల ప్రయోజనాలను కాపాడడం సహా సమాజిక అంశాల్లోనూ బీజేపీ దారుణంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. మహిళలు, దళితులపై కొనసాగుతున్న దురాగతాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. రోజు రోజుకూ రూపాయి విలువ పతనం కావడం ప్రభుత్వ ఆర్ధిక విధానాలకు అద్దంపడుతోందని సుర్జేవాలా పేర్కొన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ, నల్లధనం వంటి ప్రధాన అంశాలను కూడా బీజేపీ నాయకులు ప్రస్తావించలేదు. 2014లో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కానీ ఈ విషయంలో బీజేపీ పూర్తిగా విఫలమైంది. ఎన్ఎస్ఎస్ఓ గణాంకాల ప్రకారం గత ఐదేళ్లలో 4.7 కోట్ల ఉద్యోగాలు పోయాయి. నిరుద్యోగ రేటు గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 6.1 శాతానికి చేరింది..’’ అని సుర్జేవాలా పేర్కొన్నారు.