రోడ్డు ప్రమాదంలో మాజీ మహిళా క్రికెటర్‌ మృతి

SMTV Desk 2019-04-09 11:53:58  Elriesa Theunissen-Fourie, South Africa Women cricketer,

కేప్ టౌన్: దక్షిణాఫ్రికా మాజీ మహిళా క్రికెటర్‌ ఎల్‌రీసా తునీస్సెన్‌ ఫౌరీ(25) రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈ సంఘటనలో తన కూతురు కూడా ప్రాణాలు కోల్పోయింది. తన బిడ్డతో కలిసి కేప్ టౌన్ సమీపంలోని మైనింగ్ సిటీ స్టీల్ ఫౌంటెన్ మార్గంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై స్పందించిన క్రికెట్‌ సౌతాఫ్రికా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎల్‌రీసా మృతి మాటలకందని విషాదమన్నారు. క్రికెట్ ను ఎంతో ప్రేమించిన ఆమె అద్భుత ప్రతిభావంతురాలని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా ఎల్‌రీసా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశవాళీ క్రికెట్‌లో నార్త్‌వెస్ల్‌ డ్రాగన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఎల్‌రీసా శ్రీలంకతో జరిగిన వన్డేతో అంతర్జాతీయ మ్యాచ్‌లలో అరంగేట్రం చేశారు. మొత్తం 3 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించారు. 2013 ఉమెన్స్‌ వరల్డ్‌ కప్‌ స్క్వాడ్‌లో సౌతాఫ్రికా తరఫున ఆడిన ఎల్‌రీసా, సొంతగడ్డపై బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో చివరిసారిగా కనిపించారు. దేశం తరఫున ఆల్ రౌండర్ గా రాణించిన ఎల్‌రీసా, పలు స్థానిక జట్లకు కోచ్ గానూ వ్యవహరించారు.